జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పొలిటీషియన్‌గా ఇష్టపడేది కొందరే అయితే.. పవన్ స్టార్‌గా ఇష్టపడని వారు ఉండరనడానికి ఆయన సృష్టించిన బాక్సాఫీస్ రికార్డులే నిదర్శనం. పవన్ సినిమా చేస్తున్నారంటే ఫస్ట్ లుక్ మొదలు.. టీజర్, ట్రైలర్, సాంగ్స్, థియేటర్స్, కలెక్షన్స్ ఇలా ప్రతీది ఒక ప్రభంజనమే. సినిమా హిట్ ఫ్లాప్ అన్నదాంతో సంబంధం లేకుండా ఫస్ట్ డే నాడు నిర్మాతల్ని సేఫ్ జోన్‌లో కూర్చోబెట్టే స్టామినా పవన్‌కి మాత్రమే సొంతం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. రాజకీయలపై ఉన్న ఇష్టంతో మేకప్‌కి ప్యాకప్ చెప్పేసి పొలిటీషియన్ అవతారం ఎత్తారు. 2014 ఎన్నికల సంగ్రామంలో పొలిటీషియన్ అవతారం ఎత్తి తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేసి ఆ పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించిన పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల్లో ప్రత్యక్షఎన్నికల్లో పోటీ చేశారు. ఒక వైపు టీడీపీ, మరో వైపు వైసీపీ సీఎం కుర్చీ కోసం నువ్వా నేనా అని పోటీ పడుతున్న సందర్భంలో జనసేన జెండా పట్టి త్రిముఖ పోటీలో నిలిచారు. రసవత్తరంగా సాగిన ఈ ఎన్నికల పోరులో ఎవరుగెలుస్తారన్నది ఈనెల 23న తేలిపోనుండగా.. సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన అన్న చిరంజీవి బాటలో రాజకీయాలను ప్యాకప్ చెప్పేసి మళ్లీ మేకప్ వేసుకోబోతున్నారంటూ సినీ సర్కిల్స్‌లో పొలిటికల్ గాసిప్స్ మొదలయ్యాయి. అంతేకాదు.. పవన్ కళ్యాణ్‌కి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్‌తో పవన్ మీటింగ్ కూడా అయ్యిందని త్వరలో ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఉండబోతుందంటూ రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు హరీష్ శంకర్. ఈ వార్తలపై స్పందించాల్సిన బాధ్యత తనపై ఉన్నందున వివరణ ఇస్తున్నట్లు తెలిపారాయన. పవన్ కళ్యాణ్‌ని తాను కలిసినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సినిమా లవర్స్‌ని నేను కోరుకుంటున్నది ఏంటంటే.. దయచేసి నా నుండి కాని ప్రొడక్షన్ హౌస్ నుండి కాని అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చే వరకూ వెయిట్ చేయండని కోరారు. అయితే పవన్ కళ్యాణ్ చిత్రానికి దర్శకత్వం వహించడం అంటే చాలా ఇష్టం అంటూ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు హరీష్ శంకర్.మరోవైపు ‘వాల్మీకి’ చిత్రంలో పూజా హెగ్డే భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందంటూ వస్తున్న వార్తల్ని కూడా కొట్టిపారేశారాయన.