Highlights
- డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపు
- ఉభయ తెలుగు రాష్ట్రాల సహా
- తమిళనాడు, కేరళ, కర్ణాటకలో సినిమాల ప్రదర్శన నిలిపివేత
- ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 2,400 పైగా థియేటర్లు
దక్షిణాది రాష్ట్రాల్లో మార్చి 2 నుంచి థియేటర్లలో సినిమా ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్టు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. ఇందుకు ప్రేక్షకులు సహకరించాలని కోరింది. దీనికి దక్షిణాదిలోని చలన చిత్ర పరిశ్రమల నుంచి పూర్తి మద్దతు లభించిందని పేర్కొంది. దీనితో డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలకు వ్యతిరేకంగా సినీ పరిశ్రమలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, పంపిణీ దారులు బంద్ కు పిలుపు నిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో చిత్ర ప్రదర్శనలు నిలిపివేయనున్నారు. డిజిటల్ ప్రొవైడర్లు క్యూబ్, యూఎఫ్ ఓ సంస్థలకు, నిర్మాత సంఘాలకు ఇటీవల జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటివరకూ జరిగిన సమావేశాల్లో ప్రధానంగా మూడు అంశాలపై చర్చలు జరిగాయి. వీపీఎఫ్ ఛార్జీస్ కట్టేది లేదని, రెండు సినిమా యాడ్స్ తమకు ఇవ్వాలని, కమర్షియల్ యాడ్స్ నిడివి 8 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదనే నిబంధనలతో కూడిన మూడు అంశాలపై జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో బంద్ కు పిలుపు నిచ్చామని దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో మార్చి 2 నుంచి సినిమాలను ఆయా సర్వీస్ లకు ఇవ్వకూడదని నిర్మాతల ఐకాస నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని థియేటర్లలో చిత్ర ప్రదర్శనలు నిలిచిపోనున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 2,400 పైగా థియేటర్లు ఉండగా, ఇందులో రెండు వేల థియేటర్లు మూతపడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.