YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇక రైళ్లలో సీసీ కెమెరాలు..

ఇక రైళ్లలో సీసీ కెమెరాలు..

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

సరుకులతోపాటు ప్రయాణికుల రవాణాలో సమర్దవంతంగా పని చేస్తున్న భారతీయ రైల్వే  మరో సౌకర్యంతో ముందుకు రానుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న లక్షలాదిమంది ప్రయాణికుల భద్రతకు తొలి ఫ్రాధాన్యత ఇవ్వనుంది.  ఇప్పటివరకు పాసింజర్, సూపర్‌ఫాస్ట్ రైలు బోగీల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తున్న రైల్వేశాఖ తాజాగా కొత్తగా తయారుచేసే కోచ్‌లలో  సీసీ కెమెరాలను అమర్చేందుకు ప్రణాలికలు రూపొందించింది. రైళ్లలో జరుగుతున్న దొంగతనాలు, దోపిడీలకు అడ్డుకట్ట వేయనుంది.ఇప్పటివరకు సాధారణంగా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బెర్తులు, సీట్లు, ఫ్యాన్లు, తదితర సౌకర్యాలు కల్పిస్తుండగా రానున్న రోజుల్లో నూతనంగా తయారు చేసే బోగీలను ఆధునికీకరించనుంది. అర్ధరాత్రి రైళ్లలో ప్రయాణిస్తున్న సమయంలో కిటికీల పక్కన కూర్చున్న మహిళల మెడలో నుంచి దొంగలు మంగళసూత్రాలు, బంగారు ఆభరణాలను అపహరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నిద్రపోతున్న ప్రయాణికుల జేబుల్లో నుంచి పర్సులు, సెల్‌ఫోనులు దోచుకెళ్తున్నారు.  ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత బాధితులు రైల్వే పోలీస్ పోస్టు ఉన్న స్టేషన్లో తమ విలువైన వస్తువులు పోయాయని ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో దొంగలను గుర్తించడం, బాధితులకు న్యాయం చేసిన సందర్భాలు తక్కువగా ఉంటాయి.రోలింగ్ స్టాక్ ఆధ్వర్యంలో కొత్తగా తయారు చేసే రైలు బోగీల్లో ఇన్‌బిల్ట్‌గా సీసీ కెమెరాలను అమర్చడంతో చోరీలకు పాల్పడుతున్న వారిని సులువుగా పట్టుకునే అవకాశం ఉంటుంది. రైలు ఎక్కిన తర్వాత కోచ్‌లో అనుమానితులు ఎవరున్నారు.. మహిళలపై పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంది... దొంగతనం చేస్తున్న చిత్రాలు, చేసిన తర్వాత ఎలా పారిపోతున్నారనేది సీసీ కెమెరాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. రైళ్లలో దొంగతనాలతోపాటు కొంతమంది  పోకిరీలు మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. అయితే బోగీల్లో సీసీ కెమెరాలున్నాయన్న విషయం తెలుసుకున్న వారు తమ ప్రవర్తనను మార్చుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది తెలియకుండా, మరికొంతమంది తెలిసినా తమకేం కాదనుకుంటే చిక్కుల్లో పడతారు. ఆర్పీఎఫ్ పోలీసులు వారి చిత్రాలను రైల్వేస్టేషన్లలో ప్రదర్శిస్తూ పోకీరీలపై అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు తెలియజేస్తుంటారు.
దక్షిణ మధ్య రైల్వేకు గుండెకాయగా పేరొందిన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతిరోజూ 100కు పైగా ఎక్స్ప్రెస్, పాసింజర్ రైళ్ల ద్వారా 1.50 లక్షల మంది వివిధ ప్రాంతాలకు తరలివెళ్తుంటారు. బతుకమ్మ, దసరా, సంక్రాంతి పండుగల సమయంలో రోజుకు 2 నుంచి 3 లక్షల వరకు ప్రయాణిస్తుంటారు. వేసవి సెలవుల్లో స్టేషన్లోని ప్లాట్ఫారాలన్నీ లక్షలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి రద్దీ సమయంలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుంటారు. బంగారు వస్తువులు, సెల్ఫోన్లు.. ఇలా అందినకాడికి దోచుకెళ్తుంటారు. అయితే బోగీల్లోకి ఎక్కుతుండగా, ఎక్కిన తర్వాత జరిగే చోరీలతో ప్రయాణికులు పెద్దఎత్తున నష్టపోతుంటారు. ఈ తరుణంలో రైలు కోచ్ల్లో ఇన్బిల్ట్గా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా దొంగలు తమ బుద్ధి మార్చుకునే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు. రైళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల చోరీలను కట్టడి చేయవచ్చని పేర్కొంటున్నారు.

Related Posts