యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ పార్లమెంటు నియోజకవర్గంపై ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి, ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ మరోసారి బరిలోకి దిగుతుండటమే ఇంతటి ఉత్కంఠకు కారణంగా చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ నియోజకవర్గం సమాజ్ వాదీ పార్టీకి కంచుకోట అని చెప్పాలి. ములాయం సింగ్ యాదవ్ ఈ స్థానం నుంచి ఒకసారి, అఖిలేష్ యాదవ్ మూడుసార్లు గెలుపొందారు. డింపుల్ యాదవ్ కూడా 2012, 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచి ఎంపీ అయ్యారు. 2012లో డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. డింపుల్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో విజయం ఏకపక్షమేనని అంటున్నారు సమాజ్ వాదీ పార్టీ నేతలు. ప్రధాన పార్టీలైన బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు కూటమిగా ఏర్పడటంతో ఇక్కడ తమకు తిరుగులేదని వారు భావిస్తున్నారు. ఇటీవల ములాయం సింగ్ యాదవ్ పోటీ చేస్తున్న మెయిన్ పురి నియోజకవర్గం సభలో మాయావతి, ములాయం సింగ్ యాదవ్ కలసి పాల్గొనడం కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. డింపుల్ యాదవ్ మాయావతి పాదాలకు నమస్కరించడంతో బీఎస్సీ క్యాడర్ కూడా డింపుల్ కు జై కొట్టడానికి ఉత్సాహం చూపుతున్నారు.డింపుల్ యాదవ్ హ్యాట్రిక్ విజయాలను సాధించేందుకు ఉత్సాహపడుతున్నారు. ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ సయితం తన పార్టీ అభ్యర్థిని కనౌజ్ నుంచి పోటీ చేయించకపోవడం విశేషం. అయితే 2014 ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉండటంతో డింపుల్ యాదవ్ ఆ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతోనే గెలిచారు. ఆ ఎన్నికల్లో డింపుల్ కు వచ్చిన మెజారిటీ కేవలం 13,900 మాత్రమే. అయితే ఆ ఎన్నికలలో బీఎస్పీ అభ్యర్థికి లక్షకు పైగా ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు సీఎంలను కనౌజ్ నియోజకవర్గం ఇచ్చింది. 1984లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు.కనౌజ్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలుండటం గమనార్హం. ఇక్కడ సమాజ్ వాదీ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మధ్య మాత్రమే పోటీ ఉంది. ఇక్కడ హిందుత్వం కూడా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశముందంటన్నారు. అయితే బీఎస్పీ, ఎస్పీల కలయికతో ఖచ్చితంగా తాము గెలిచి తీరుతామంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా కనౌజ్ పార్లమెంటు స్థానాల్లో పలు దఫాలు పర్యటించి ప్రచారం నిర్వహించారు. మరి డింపుల్ హ్యాట్రిక్ కొడతారా? లేదా? అన్నది చూడాలి.