యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
కర్ణాటకలో ఎన్నికల ఫలితాల మాట ఎలా ఉన్నప్పటికీ సంకీర్ణ సర్కార్ లో ఉన్న మిత్రపక్షాల మధ్య మాత్రం దూరం పెరిగే అవకాశాలున్నాయి. ఫలితాలు రాకముందే ఇలా ఉంటే.. రిజల్ట్ వచ్చిన తర్వాత విభేదాలు మరింత ముదిరే అవకాశం ఉందంటున్నారు. నిజంగానే జేడీఎస్ అగ్రనేత, దేవెగౌడ మనవడు నిఖిల్ గౌడ మాండ్యలో ఓటమి పాలయితే వెనువెంటనే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడకతప్పదంటున్నారు విశ్లేషకులు. ఒక్క మాండ్య మాత్రమే కాదు అనేక నియోజకవర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులకు కాంగ్రెస్ క్యాడర్ సహకరించలేదన్న వార్తలు వస్తున్నాయి. ఇంటలిజెన్స్ నివేదికలు కూడా అవే చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి తాము పోటీ చేసిన ఏడు పార్లమెంటు నియోజకవర్గాల పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. మాండ్యా పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ స్థానాల్లోనూ జేడీఎస్ ఎమ్మెల్యేలున్నప్పటికీ మూడు నియోజకవర్గాల్లో నిఖిల్ గౌడ వెనుకబడి ఉన్నారని ఇంటలిజెన్స్ నివేదిక తెలియజేయడంతో కుమారస్వామిలో ఆందోళన నెలకొంది. ఇటీవల ఆయన మంత్రి పుట్టరాజును పిలిపించుకుని పరిస్థితిని సమీక్షించారు. సుమలత కు అవుట్ రైట్ గా కాంగ్రెస్ నేతలు సపోర్ట్ చేయడాన్ని కూడా కుమారస్వామి సహించలేకపోతున్నారు. నేతలను కట్టడి చేయలేని కాంగ్రెస్ పార్టీపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు.మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత కు చలువరాయస్వామి, నరేంద్ర స్వామి, మాగడి బాలకృష్ణలు బహిరంగంగానే మద్దతిచ్చారు. తాజాగా సుమలత ఇచ్చిన విందులో వారు పాల్గొనడం కూడా చర్చనీయాంశమైంది. దీంతో కుమారస్వామి సమన్వయ కమిటీ ఛైర్మన్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయి అమితుమీ తేల్చుకోవాలనుకుంటున్నారు. సిద్ధరామయ్య శాసనసభ ఉప ఎన్నికల్లో తీరిక లేకుండా ఉండటంతో ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. అయితే జేడీఎస్ కూడా తమకు సహకరించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.కొన్నేళ్లుగా క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న పార్టీ క్యాడర్ తమ నేతకు టిక్కెట్ దక్కకపోవడంతో రెండు పార్టీల కార్యకర్తలు మద్దతు ఇవ్వలేదని ఎన్నికల అనంతరం తేలింది.ఈ విషయాన్ని సిద్ధరామయ్య పై గెలిచిన జి.టి.దేవెగౌడ కూడా అంగీకరించారు. రెండు పార్టీల కార్యకర్తలు బీజేపీకే ఓటు వేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర స్థాయిలో నేతలు కలసినా కిందిస్థాయిలో క్యాడర్ కలవలేదనడానికి జి.టి.దేవెగౌడ వ్యాఖ్యలే కారణమని చెప్పక తప్పదు. ఫలితాల అనంతరం మరింత పోస్ట్ మార్టం జరిగే అవకాశముంది. మొత్తం మీద ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తమకు సహకరించలేదని చేస్తున్న వ్యాఖ్యలు భవిష్యత్తులో సంకీర్ణానికి సవాలుగా మారనుంది.