Highlights
- గుడ్‌బై చెప్పిన బీహార్ మాజీ సీఎం
- ఇప్పటికే శివసేన, టీడీపీలు హెచ్చరికలు
- ఆర్జేడీ,మహాకూటమిలో చేరిన మాంఝీ
కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న ఎన్డీయే కూటమి నానాటికి బలహీనపడుతున్నట్టు కనిపిస్తుంది. రోజు రోజుకి చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తుంది. ఇప్పటికే ఎన్డీయే కూటమితో తెగతెంపులకు సిద్ధమని శివసేన, టీడీపీలు హెచ్చరికలు జారీ చేశాయి. తాజాగా బీహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ(హిందుస్థాని అవాం మోర్చ)ని పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి...ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ఆయన నివాసంలో కలిసిన అనంతరం ఈ మేరకు మాంఝీ మీడియాకు ప్రకటించారు. మాంఝీ మహాకూటమిలో చేరినట్లు తేజస్వి ధృవీకరించారు. తమ తల్లిదండ్రులకు మాంఝీ పాత మిత్రుడని, ఆయన్ను కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.