YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

రేపు 07-05-2019 మంగళవారం.... అక్షయ తృతీయ

   రేపు 07-05-2019 మంగళవారం.... అక్షయ తృతీయ

 యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:

మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈ నాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాడు ఉపవాస దీక్ష జరిపి, ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువుపూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు.

అక్షయ తృతీయ ప్రాముఖ్యత
1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

అక్షయ తృతీయ నాడు జ్ఞానాన్ని సంపాదించడం, దానాలను చేయడం వల్ల, మామూలు దినములకన్నా, అనేక రెట్లు ఫలితాలను పొందగలరని వేదాలు చెప్పాయి. బంగారం కొనమని ఎక్కడా చెప్పబడలేదు. అవన్నీ వ్యాపారస్తులు సృష్టించిన పన్నాగం. అమాయక జనాలచేత బంగారం కొనిపించి వారు అత్యంత ధనవంతులయ్యే దానికి వాళ్ళు అల్లిన కృత్రిమ ప్రచారం

Related Posts