YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్ ప్రారంభం

అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్ ప్రారంభం

యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:

రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాల్లోని ఐదు కేంద్రాల్లో సోమవారం రీ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 5.30 గంటలకే అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని ఐదు కేంద్రాల్లో 7 గంటలకు రీ పోలింగ్ మొదలైంది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన రీ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు . 
ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో అయిదు పోలింగ్ స్టేషన్లలో నిర్ణీత సమయానికి మాక్ పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది సోమవారం ఉదయం తెలిపారు. సరిగ్గా అన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైందని ఆయన చెప్పారు.
 గుంటూరు జిల్లాలో రీ పోలింగ్ జరుగుతున్న రెండు కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఓటర్లు ఎక్కడా ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. 
కలనూతలలో ప్రశాంతంగా రీ పోలింగ్
ప్రకాశం జిలా ఎర్రగొండపాలెం పరిధిలోని కలనూతలలో రీ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్లో కలనూతలలో రాత్రి పన్నెండు తరువాత కూడా క్యూ లో ఓటర్లు వున్నారు. అయితే ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఓటు వేయలేకపోయారు. దీంతో రాజకీయ పార్టీలు, ఓటర్లు విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం రీ పోలింగ్ నిర్వహిస్తోంది. కలనూతల 247 పోలింగ్ బూత్లో భారీ బందోబస్తు మధ్య పోలింగ్ కొనసాగింది. .
ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని ఇసుకపాలెంలో రీ పోలింగ్ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఓటు వేసేందుకు ఉదయం నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. రీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. .

Related Posts