YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీకాకుళంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

 శ్రీకాకుళంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

రోజురోజుకూ ఇసుక మాఫియా అక్రమాలు హెచ్చు మీరుతున్నాయి. నాగావళి, వంశధార నదులు ఇసుక మాఫియాకు కారణభూతమవుతున్నాయి.అక్రమార్కులు వారి సంపాదన కోసం నది గర్భాన్ని పూర్తిగా తవ్వేస్తున్నారు. దీంతో పర్యావరణం క్షీణిస్తూ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.. ఇంతవరకు ఎన్నికల విధుల్లో నిమగమైన అధికారులు ఉన్నారని రాత్రి పగలు ఇసుక తరలించిన మాఫియా. ఇప్పుడు కొన్ని కేంద్రాల్లో అడ్డాగా చేసుకుని రాత్రి వేళల్లో లోడింగ్‌ చేసి పంపిస్తున్నారు. ఇక్కడ ఒక లారీ ఇసుక పది వేల రూపాయలకు లోడ్‌ చేస్తే విశాఖపట్నం చేరే సరికి మధురవాడ ప్రాంతంలో డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేసి అక్కడ రూ.20 వేలకు విక్రయాలు సాగిస్తున్నారని సమాచారం. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు మాఫియా విస్తరించిందంటే ఈ మూలాలు ఎంత లోతులో ఉన్నాయో అవగతమవుతుంది. జెసిబిలు, ప్రొక్లైనర్స్‌తో లారీలకు లోడ్‌ చేస్తున్నారు.  ప్రకతి సంపదను విరివిగా దోచుకుంటున్నారు. అధికారుల దాడులు అప్పుడప్పుడు మాత్రమే చేస్తున్నారు. దాడులు చేసే అధికారులపై అధికార పార్టీ తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడమే వారి తూతూ మంత్రం దాడులకు కారణమనే విమర్శలు ఉన్నాయి. వంశధార నదిలో పొన్నాం ర్యాంప్‌ సీజ్‌ చేసిన తరువాత రాత్రి పూట ఇసుకను తరలిస్తున్నారు. దీనంతటికీ అడ్డా కొత్తరోడ్డు జంక్షన్‌. ఇక్కడ నుంచే మాఫియా సామ్రాజ్యం విస్తరించి నదీ పరివాహక ప్రాంతమంతా పాకింది. జీవ నధుల్లో వందల లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడమే కాకుండా పర్యావరణం కూడా పూర్తిగా ఇసుక తరలింపుతో క్షీణించిపోతోంది. అంతేకాకుండా సంపదను మాఫియా నిలువునా దోచుకుంటున్నారు. చెల్లించాల్సిన సుంకాన్ని కూడ కనీసం చెల్లించకుండా రాత్రి సమయాల్లో ఇసుకను తరలిస్తున్నారు. సహజ సంపదను వశం చేసుకునేందుకు అధికార పార్టీలోని కొందరు నాయకులు వ్యవహరిస్తున్నారు. వంశధార నదిలో దందా మొదలుపెడితే, నాగావళి నది వరకు తీసుకెళ్తున్నారు. ఇటీవల వంశధార నదిలో జరిగే అక్రమాలకు నిదర్శనం ఇసుక లారీలు ఒక జెసిబి, తుపాను సమయంలో మునిగిపోవడంతో పెద్ద చర్చకు తెరతీసింది. ఇసుక అక్రమ వ్యాపారంగా చేస్తున్న మాఫియా సామ్రాజ్యానికి అధికార పార్టీ నాయకులు అండదండలు మెండుగా ఉన్నాయని చెప్పాలి. లారీలకు లోడ్‌ చేస్తున్న సమాచారం తెలుసుకొని అధికారులు దాడులకు చేస్తున్న సమయంలో అప్పటికే కొంత మంది నేతలతో ఆ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల ఆమదాలవలస మండలంలోఇన కలివరం, దూసి, కొత్తవలస, నిమ్మ తర్లువాడలో మూడు రోజులుగా సుమారు 200 లారీలపై కేసులు నమోదు చేయాల్సి ఉండగా నాయకుల మౌఖిక ఆదేశాలతో అధికారుల తోక ముడిచారు. హైకోర్టు ఇటీవల జారీచేసిన ఆదేశాలను సైతం మాఫియా బేఖాతరు చేస్తుంది. ఇసుకను నిలువెత్తు లోతులు తవ్వడం, దానిని తరలించడం ద్వారా పర్యావరణం క్షీణించి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ కారణంగానే ధర్మాసనం ప్రభుత్వానికి చీవాట్లు పెడుతూ రూ.100 కోట్లు గ్రీన్‌ ట్రిబ్యూనల్‌కు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలను సైతం అధికారులు అమలు చేయలేక అధికార పార్టీ నాయకుల వద్ద మోకరిల్లుతున్నారనే విమర్శలు వ్యాపిస్తున్నాయి. జిల్లా కలెక్టరు స్పందించి ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తే కానీ పర్యావరణాం, భూగర్భ జలాలను కాపాడుకోలేమనే దిగులుతో ప్రజలు ఉన్నారు.

Related Posts