యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండలు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. ఉదయం ఏడు గంటలు మొదలుకుని సాయంత్రం ఆరు గంటల వరకు ఉష్ణవేడి ప్రజలను తిప్పలు పెడుతున్నది. ఏకదాటి ఎండలు, తీవ్ర ఉష్ణప్రభావంతో ప్రజలు అక్కడికక్కడే కుప్పకూలుతున్నారు. జిల్లాలో ఈ రకమైన ఎండలు ఇంతవరకు చూడలేదని వాతావరణ శాఖ అధికారులు సైతం చెబుతున్నారు. మే నెల ప్రారంభం కావటంతో భానుడి ప్రతాపం మరింత తీవ్ర రూపం దాల్చింది. దీంతో వడదెబ్బ మరణాల సంఖ్య జిల్లాలో అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే నియంత్రణ చర్యలు చేపట్టటంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఐదు రోజులలో ఎనిమిది మంది వడదెబ్బకు బలయ్యారు. మే 2న హిందూపురం ప్రాంతానికి చెందిన నంజుండప్ప, బుక్కపట్నం ప్రాంతానికి చెందిన లక్ష్మినారాయణ, గుమ్మఘట్ట ప్రాంతానికి చెందిన భీమన్నలు వడదెబ్బతో మరణించారు. ఈ రకంగా జిల్లాలో వేసవి తాపంతో ప్రజలు మృత్యువాత పడుతుంటే ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకోవటంలో అలసత్వంగా వ్యవహరిస్తున్నది. ఆరోగ్య శాఖ తీరు మరీ దారుణంగా తయారైంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయటంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. పిహెచ్‌సి స్థాయిలో వడదెబ్బ నుంచి రక్షణ పొందటానికి అవసరమైన సూచనలు అందించటంలో వైద్యశాఖ యంత్రాంగం జాప్యం చేస్తోంది. మరో వైపు వడదెబ్బ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అందుకోసం ఒక కమిటీని కూడా నియమించింది. కమిటీలో రెవెన్యూ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను నియమించింది. వడదెబ్బ భారిన పడిన వ్యక్తి మృతికి క్షేత్ర స్థాయిలో వివరాలను సేకరించి ఈ కమిటీ నిజనిర్థారణ చేయాల్సి ఉంటుంది. అయితే శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా వడదెబ్బ మృతులను గర్తించటంలో అలసత్వం జరుగుతున్నది. ఫలితంగా వడదెబ్బ బాధితుల కుటుంబాలకు పరిహారం అందడం లేదు.జిల్లాలో అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు ఆరుగురు వడదెబ్బతో మృతిచెందారని అధికారులు నిర్థారించారు. ప్రభుత్వం వడదెబ్బ బారిన పడి మృతిచెందిన వారికి రూ.50వేలు పరిహారం ఇస్తోంది. అయితే చాలామటుకు అధికారులకు ఈ విషయం కూడా తెలియని పరిస్థితి ఉంది. స్వయానా ఈ మాటను ఓ జిల్లా అధికారి స్వయంగా చెప్పారు. అంతేకాకుండా తమకు ఎలాంటి గైడ్‌లైన్స్ లేవని సెలవిచ్చారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా పదుల సంఖ్యలో వడదెబ్బ బారిన పడి మృతిచెందిన వారికి పరిహారం పరిహాసంగా మారింది.