యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రసిద్ధిగాంచిన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్ విగ్రహం మకుటంలోని వజ్రం కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల నుంచి ఈ వజ్రం కనిపించకపోయినప్పటికీ... అధికారులు, పూజారాలు మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవరత్నాలతో కూడిన అమ్మవారి మకుటంలో ఓ వజ్రం చాలా రోజుల నుంచే కనిపించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై మీడియాలో కథనాలు వచ్చిన తరువాతే ఆలయ అధికారులు దీనిపై స్పందించడం గమనార్హం. పది సంవత్సరాల క్రితం నవరత్నాలతో కూడిన వజ్రాన్ని ఓ భక్తుడు అమ్మవారికి బహూకరించారు. అయితే పూజారులు, అధికారులు మాత్రం అభిషేకం చేసే సమయంలో ఈ వజ్రం పోయి ఉంటుందని చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతకాలం ఈ విషయాన్ని ఎందుకు దాచి ఉంచారనే అంశంపై మాత్రం ఆలయ అధికారులు సమాధానం చెప్పడం లేదు. అర్చకుల నుంచి దీనిపై వివరణ కోరామని చెబుతున్న అధికారులు... వారి సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మరోవైపు తిథి, నక్షత్రం చూసి మళ్లీ వజ్రం అమర్చుతామని అధికారులు అంటున్నారు. మొత్తానికి గతంలో విగ్రహాన్ని మరో ప్రాంతానికి తీసుకొచ్చి పూజలు నిర్వహించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ అధికారులు... మరోసారి వివాదంలో ఇరుక్కోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.