యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సీబీఎస్‌ఈ పదోతరగతి తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం (మే 6న) విడుదలయ్యాయి. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను వెల్లడించింది. సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫలితాల్లో మొత్తం 91.10 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాదితో పోలిస్తే 4.40 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. గతేడాది మొత్తం 86.70 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలను ఫిబ్రవరి 21 నుంచి మార్చి 29 వరకు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 6 వేల పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 18,27,472 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 29 వరకు పదోతరగతి పరీక్షలు, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు 12వ తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ నిర్వహించిన సంగతి తెలిసిందే. 10, 12వ తరగతి పరీక్షలకు మొత్తం 31,14,821 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 12 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరుకాగా.. 18,27,472 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. మే 2న 12వ తరగతి ఫలితాలను వెల్లడించింది. పరీక్షలు పూర్తయిన 28 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించడం విశేషం. 12వ తరగతి ఫలితాల్లో మొత్తం 83.4 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో యూపీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు 499/500 మార్కులతో ఉమ్మడి టాపర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. పదోతరగతి ఫలితాలను సోమవారం (మే 6) వెల్లడించింది.
13 మందికి ఫస్ట్ ర్యాంక్
500 మార్కులకు గాను 499 మార్కులను తెచ్చుకున్న 13 మంది విద్యార్థులు టాప్ ర్యాంక్ ను కైవసం చేసుకున్నారు. 498 మార్కులను సాధించిన 24 మంది రెండో ర్యాంకును పంచుకున్నారు. 497 మార్కులతో 58 మంది విద్యార్థులో మూడో ర్యాంకును కైవసం చేసుకున్నారు.మొత్తమీద 10వ తరగతిలో 91.1 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 99.85 శాతం ఉత్తీర్ణతతో ట్రివేండ్రం, 99 శాతంతో చెన్నై, 95.89 శాతంతో అజ్మీర్ రీజియన్లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.ప్రతి ఏటా ఫలితాలను విడుదల చేస్తున్న సమయం కంటే ముందుగానే ఈసారి ఫలితాలను వెల్లడించామని బోర్డు ఈ సందర్భంగా ప్రకటించింది. దీనివల్ల ఉన్నత చదువుల అడ్మిషన్ల విషయంలో విద్యార్థులకు తగినంత సమయం లభిస్తుందని తెలిపింది.