యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయం వేడెక్కింది. వైసీపీ-టీడీపీ అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటూ మాటల యుద్ధానికి దిగారు. టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ.. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు చేసిన ఫోన్‌కాల్‌తో నియోజకవర్గంలో వేడి రాజుకుంది. ఈ ఫోన్ కాల్ తర్వాత వంశీ తమను బెదిరిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. వంశీ తమ ఇంటికొచ్చి సన్మానం చేస్తానంటూ ఫోన్ చేస్తున్నారని సీపీకి చెప్పారు. సీన్ కట్ చేస్తే వెంకట్రావు ఫిర్యాదుపై వంశీ లేఖ రాస్తూ మళ్లీ హీట్ పెంచారు. తాజాగా వంశీ లేఖపై వెంకట్రావు స్పందించారు.. తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరంటూ కౌంటరిచ్చారు. వల్లభనేని వంశీకి ఓటమి భయం పట్టుకుందన్నారు వెంకట్రావు. ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాజకీయాల్లోకి రావాలి.. ప్రజలకు సమస్యలు సృష్టించేందుకు కాదన్నారు. వంశీ తాటాకు చప్పుళ్లకు భయపడితే గన్నవరం వచ్చేవాడినే కాదన్నారు వెంకట్రావు. ఈ ఉడత ఊపులకు భయపడే రకం కాదన్నారు. ప్రాణహాని ఉందంటూ తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని.. విజయవాడ సీపీ కలవమంటేనే తమ పార్టీ నేత దాసరి బాలవర్ధన్‌రావుతో వెళ్లి కలిశానని చెప్పుకొచ్చారు. ఓట్ల కోసం నీచ రాజకీయాలు చేయడం వంశీకి అలవాటన్నారు వెంకట్రావు. వంశీ అరాచకాలు టీడీపీ నేతలే భరించలేక పోతున్నారని.. గుడిని, గుడిలో లింగాన్ని మింగిన చరిత్ర వంశీదన్నారు. స్థానిక ఎమ్మెల్యే పేరు ఎక్కడ చెప్పలేదు.. ఆయన అరాచకాలు, దోపిడీలను ప్రజల్లోకి తీసుకెళ్లానన్నారు. వంశీ వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ మాట్లాడలేదని.. ఈ ఐదేళ్లలో ప్రజలని భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ప్రజలకు మంచి చేద్దామని అమెరికా నుంచి వచ్చానని.. దోపిడి చేయడం కోసం కాదన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే తన అక్రమాలపై విచారణ జరుపుతారనే భయంతోనే వల్లభనేని వంశీ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వెంకట్రావు విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వస్తే తన పరిస్థితి ఏంటనే భయంతో వంశీ ఇలా మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే వంశీ చేసిన దోపిడీనీ బట్టబయలు చేస్తామన్నారు. వంశీ 2014 ఎన్నికలకు ముందు బెంగుళూరులో వైఎస్ జగన్‌ని కలిసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.