యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఏపీలో 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి మే 5న ప్రాథమకి పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 727 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. గ్రూప్-2 పరీక్షలకు మొత్తం 2,95,036 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,28,263 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 1,77,876 (77.92%) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మిగతా 50,387 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. గ్రూప్-2 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ 'కీ' త్వరలోనే వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మే 7న గ్రూప్-2 ప్రాథమిక కీ విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-2 ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. అధికారిక వెబ్సైట్లో తప్ప మిగతా వెబ్సైట్లలో వచ్చే ఏ ఆన్సర్ కీని నమ్మ వద్దని అధికారులు అభ్యర్థులను కోరారు. ప్రాథమిక కీ విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుది కీని విడుదల చేస్తారు. అనంతరం స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1 : 12 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. వీరికి జులై 18, 19 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్‌లో అన్ని పేపర్లూ రాయాల్సిందే. ఏ ఒక్క పేపర్ రాయకపోయినా తర్వాత ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు.