యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం ఐదు పోలింగ్ కేంద్రాల్లో సోమవారం (మే 6) రీపోలింగ్ నిర్వహించారు. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ ఐదు స్థానాల్లో పోలింగ్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆయా పోలింగ్ బూత్‌ల పరిధిలో మధ్యాహ్నం 5 గంట వరకు పోలైన ఓట్ల వివరాలను అధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని కేసానుపల్లి పోలింగ్ కేంద్రంలో 956 మంది ఓటర్లకు గాను 707 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో నల్లచెరువు పోలింగ్ కేంద్రంలో 1396 మంది ఓటర్లలో 891 మంది తమ ఓటు వేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలోని ఇసుకపాలెంలోని పోలింగ్ కేంద్రంలో 1084 ఓట్లకు గాను 685 ఓట్లు పోలయ్యాయి. సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలోని అటకానితిప్పలో 558 ఓట్లకు గాను 494 ఓట్లు పోలయ్యాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో 1070 మంది ఓటర్లకు గాను 440 మంది మాత్రమే ఓటు వేశారు.