యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వల్లభనేని వంశీ… పరిటాల రవి అంటే పడిచచ్చేంత అభిమానం. అలాగే గన్నవరం నియోజకవర్గంలో పట్టున్న నేత. తెలుగుదేశం పార్టీ అంటే వల్లమాలిన ప్రేమ. అయితే పోలింగ్ తర్వాత వల్లభనేని వంశీ వైఖరి తెలుగుదేశం పార్టీ నేతలకు సయితం మింగుడుపడకుండా ఉంది. వల్లభనేని వంశీ వైఖరిపై పార్టీలో పెద్దయెత్తున చర్చ నడుస్తోంది. వంశీ అసలు పార్టీలో ఉంటారా? గెలిచినా ఆయన జగన్ చెంతకు వెళతారా? అన్న అనుమానాలు కూడా పార్టీ సీనియర్ నేతల్లో బయలుదేరాయంటే పరిస్థితి ఎంతవరకూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.వల్లభనేని వంశీ ఎప్పుడూ వివాదాలకు ముందుంటారు. విజయవాడలో రోడ్ షో చేస్తున్న జగన్ తో కరచాలనం చేసి అప్పట్లో వార్తల్లో కెక్కారు. తాను వైసీపీిలోకి వెళ్లేది లేదని వెంటనే స్పష్టం చేసినప్పటికీ కొన్ని రోజుల పాటు ఆ వివాదం నడిచింది. తర్వాత సొంత పార్టీనే ఇబ్బంది పెడుతూ, చివరకు ముఖ్యమంత్రి పేషీలోని అధికారులనే వివాదాల్లోకి లాగి వార్తల్లోకి ఎక్కారు వంశీ. అయితే నారా లోకేష్ సర్దుబాటు చేయడంతో వివాదం ముగిసిందంటారు.ఇప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు బరిలో నిలిచారు. పోలింగ్ గత నెల 11వ తేదీన ముగిసింది. పోలింగ్ అనంతర విశ్లేషణ ప్రకారం పోటీ నువ్వా. నేనా? అన్నట్లు జరిగింది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో గెలుస్తారన్న అంచనాలు గన్నవరంపై విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన వంశీ ప్రత్యర్థి పార్టీ ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.గన్నవరం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు సన్మానం చేస్తానని వంశీ ఫోన్ చేయడమే కాకుండా ఆయన ఇంటికి స్వయంగా వెళ్లారు. ఈ మేరకు సీసీ టీవీ పుటేజీలను కూడా యార్లగడ్డ వెంకట్రావు ఇచ్చారు. అలాగే దాసరి బాలవర్థన్ రావుకు కూడా ఫోన్ చేసి సన్మానిస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. వంశీ మాత్రం వారితో సత్సంబంధాలు కొనసాగించేందుకే తాను సన్మానం చేస్తానని చెప్పడం, ఆయన ఇంటికి వెళ్లడం నిజమేనని అంగీకరిస్తున్నారు. దీంతో పార్టీకి అర్థంకానిది ఒకటే ఉంది. టీడీపీ అధికారంలోకి రాలేదని భావించి జగన్ పార్టీకి దగ్గరయ్యేందుకు వంశీ ప్రయత్నిస్తున్నారా? లేదా? తన ఓటమి ఖాయమని తెలిసి ప్రత్యర్థులతో సఖ్యతగా మెలిగేందుకు ట్రై చేస్తున్నారా? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరి వంశీ రూటు ఎటువైపు ఉంటుందో తెలియాలంటే మరో పదిహేను రోజులు ఆగాల్సిందే.