లోక్ సభ ఎన్నికలు ముగియక ముందే అందరూ శత్రువులగా మారుతున్నారు. మిత్రులనే శత్రువులుగా మార్చుకుంటున్న ఘనత ఒక్క రాహుల్ గాంధీకే చెల్లింది. ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత రాహుల్ గాంధీలో ఆత్మవిశ్వాసం పెరిగిందంటున్నారు. మోదీ గ్రాఫ్ తగ్గుముఖం పట్టడం తనకు అనుకూలించే అంశమని ఆయన అభిప్రాయపడుతున్నట్లుంది. తాము ప్రకటించిన ‘‘న్యాయ్’’ పథకానికి దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తుందని తెలియడంతో రాహుల్ గాంధీ ఏకపక్షంగా వెళుతున్నారన్న వ్యాఖ్యలు మిత్రపక్షాల నుంచి విన్పిస్తున్నాయి. ప్రధాని ఎవరో ప్రజలు నిర్ణయిస్తారని రాహుల్ వ్యాఖ్యానించడాన్ని కూడా కొందరు మిత్రపక్ష నేతలు తప్పు పడుతున్నారు. సంఖ్యాబలాన్ని బట్టి ప్రధాని అభ్యర్థి ఎవరో తేలుతుందని చెబుతున్నారు.రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో మిత్ర పక్షాలనూ వదలడం లేదు. కాంగ్రెస్ ను బలోపేతం చేసే దిశగానే ఆయన ఎన్నికల ప్రచారం సాగుతున్నట్లు కనపడుతోంది. మాయావతి, మమత, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ ఇలా ఏ ఒక్కరినీ ఆయన వదలకుండా విమర్శలు గుప్పిస్తున్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల రిమోట్ నరేంద్ర మోదీ చేతిలో ఉందన్న రాహుల్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై మాయావతి, అఖిలేష్ యాదవ్ లు మండి పడుతున్నారు. మాయావతి అయితే బీజేపీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నట్లుందని మండిపడ్డారు.ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ను పక్కన పెట్టిన మాయావతి, అఖిలేష్ యాదవ్ లు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా యూపీలో బలం పెంచుకోవాలని భావించి దాదాపు 70 స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దించింది. అంతేకాకుండా ఏకంగా ప్రియాంక గాంధీని ఇన్ ఛార్జిగా నియమించింది. ప్రియాంక సభలకు పెద్దయెత్తున ప్రజలు హాజరవుతుండటంతో తమ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ చీలుస్తుందేమోనన్న టెన్షన్ మాయావతి, అఖిలేష్ యాదవ్ లలో ఉంది. అందుకే కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు. మరోవైపు బీజేపీకి మేలు చేకూర్చేందుకు బలహీనమైన అభ్యర్థులను సమాజ్ వాదీ పార్టీ బరిలోకి దించిందని ప్రియాంక ఆరోపణలను కూడా ఎస్పీ అధినేత అఖిలేష్ సీరియస్ గా తీసుకున్నారు.ఇక కాంగ్రెస్ పార్టీ బీజేపీని గెలిపించేందుకే పొత్తుకు దూరమయిందని ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఓడించాలన్న కనీస ఆలోచనలేదన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పొత్తు ప్రతిపాదనకు నో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక కాశ్మీర్ లోని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సయితం కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాశ్మీర్ ను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. ఇక మమత సంగతి సరేసరి. రాహుల్ ను ఓ పిల్లకాకిగా మమత ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మొత్తంగా చూస్తే మిత్రపక్షాలన్నీ ఎన్నికల ఫలితాలకు ముందే శత్రువులుగా మారుతున్నాయా? లేక రాహుల్ తనంతట తానే వారిని శత్రువులుగా చూస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.