ఆంధ్ర్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 23వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సయితం వెయ్యి శాతం తిరిగి అధికారంలోకి వస్తామంటూ ప్రతి రోజూ టెలికాన్ఫరెన్స్ లో నేతలకు ధైర్యం నూరిపోస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలింగ్ రోజున మాత్రం అధికారంలోకి వస్తామని చెప్పారు తప్ప తర్వాత కామ్ అయిపోయారు. వైసీపీ నేతలు మాత్రం జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటూ పెద్దయెత్తున సంబరాలు కూడా చేసుకుంటున్నారు. సర్వేలు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.ఒక అడుగు ముందుకేసి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి ముహూర్తాలు కూడా చూసేస్తున్నారట. జగన్ సీఎం అయిపోయినట్లే ఫీలవుతున్న నేతలు పండితుల వద్దకు వెళ్లి ముహూర్తాలను నిర్ణయించేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ఈ నెల 26వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కొందరు నేతలు మాత్రం మే 26వ తేదీ బాగాలేదని, పండితుల సూచన మేరకు మే 30వ తేదీన ప్రమాణస్వీకారంచేస్తే అంతా బాగుంటుందని సూచనలు కేంద్రకార్యాలయానికి పంపుతున్నారట. మరికొందరు అత్యుత్సాహంతో జగన్ పేరిట సీఎం నేమ్ ప్లేట్ లు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.వాస్తవానికి జగన్ ఈ ఎన్నికల్లో ముహూర్తాలను బాగానే నమ్మినట్లు కన్పిస్తోంది. జగన్ తన ప్రజాసంకల్ప పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి సలహాలు తీసుకున్నారు. పాదయాత్రకు ముహూర్తం పెట్టించుకున్నారు. పాదయాత్రకు ముందు చినజీయ్యర్ స్వామిజీని కలసి ఆశీస్సులు పొందారు. అంతేకాదు చివరకు అభ్యర్థలు జాబితా విడుదల చేసే ముహూర్తాన్నికూడా స్వరూపానందేంద్ర స్వామీజీయే నిర్ణయంచారన్నది పార్టీలో ఎవరిని అడిగినా చెబుతారు. స్వామీజీ సూచనల మేరకే తొలుత తొమ్మిది మందితో కూడా ఎంపీ అభ్యర్థుల జాబితా, తర్వాత రోజు మొత్తం జాబితాను జగన్ విడుదల చేశారు.
తాజాగా స్వరూపానందేంద్ర స్వామీజీ జగన్ ప్రమాణస్వీకారం ముహూర్తం ఈనెల 30వ తేదీన నిర్ణయించారని తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన స్వరూపానందేంద్రను కొందరు వైసీపీ సీనియర్ నేతలు కలవగా ఆయన ముహూర్తం చూసి చెప్పడంతో ఆ విషయం జగన్ కు చేరవేశారట. అయితే గత ఎన్నికల్లో సయితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని బాగా ప్రచారం జరిగింది. అంతేకాదు జగన్ ముఖ్యమంత్రి అంటూ పెద్దయెత్తున పార్టీ నేతలు సంబరాలు కూడా చేసుకున్నారు. చివరకు తెలుగుదేశం పార్టీ గెలిచింది. మరీ ఈసారి ముహూర్త బలం జగన్ విషయంలో నిజమవుతుందా? లేదా? అన్నది చూడాలి.