YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఒంగోలు సీటు టీడీపీకి కలిసొచ్చేలా లేదా

ఒంగోలు సీటు టీడీపీకి కలిసొచ్చేలా లేదా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 

తెలుగుదేశం పార్టీకి కలిసిరాని నియోజకవర్గాల జాబితాలో ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పార్లమెంటు సీటు మొదటి స్థానంలో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత చాలా తక్కువ సార్లు విజయాలు సాధించిన జాబితాలో ఒంగోలు ఎంపీ సీటు కూడా ఒకటి. పార్టీ ఆవిర్భవించాక 9 సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు అక్కడ టిడిపి వ్యతిరేక పార్టీలు విజయం సాధించాయి. 1984లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన బెజవాడ పాపిరెడ్డి విజయం సాధించగా ఆ తర్వాత 15 సంవత్సరాలకు 1999లో కరణం బలరాం గెలిచారు.1999లో ఇక్క‌డ క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన క‌ర‌ణం గెల‌వ‌డం ఓ రికార్డే. ఆ తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాలకు ఒంగోలు లోక్‌స‌భ సీటుపై టిడిపి జెండా ఎగురుతుందా ? లేదా తనకు క‌లిసిరాని సీటును మరోసారి టిడిపి కోల్పొనుందా ? అన్న దానిపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జిల్లాలో న‌డుస్తున్నాయి.వైసీపీ నుంచి ఎన్నికల ముందు వరకు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాస రెడ్డి పోటీ చేయగా…. టిడిపి నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి శిద్ధా రాఘవరావు బరిలో ఉన్నారు. వాస్త‌వంగా శిద్ధా ద‌ర్శి నుంచే అసెంబ్లీకి పోటీ చేయాల‌ని అనుకున్నా చివ‌ర్లో బాబు ఒత్తిడి మేర‌కు ఆయ‌న ఎంపీగా పోటీ చేశారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం మాగుంట ఫ్యామిలీకి కంచుకోట. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇక్కడ వరుస విజయాలు సాధించిన శ్రీనివాసరెడ్డి గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి జంప్ చేసి వైసీపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ సారి ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో సంబంధం లేకుండా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వీరిద్దరికీ క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేనట్టుగా పోలింగ్ శాతం ఏకంగా 85 వరకు చేరడంతో అభ్యర్థులు ఇద్దరు గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు.గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెంలో వైసిపికి 19 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆ పార్టీ ఎంపీ సీటు కేవలం 13 వేల ఓట్ల మెజార్టీతో గెలుచుకుంది. ఈ సారి వైసిపి ఎర్రగొండపాలెం, గిద్దలూరు, ద‌ర్శి నియోజకవర్గాల్లో తమకు 50 వేల ఓట్ల ఆధిక్యం వస్తుందని ఆశలు పెట్టుకుంది. ఒంగోలు, కొండపి, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థికి ఓట్లు తగ్గినా… పైమూడు నియోజకవర్గాల్లో వచ్చే మెజార్టీతో టిడిపి తమను దాటటం అసాధ్యమని వైసిపి భావిస్తోంది. ఇక టిడిపి వెర్షన్ మరోలా ఉంది. ఎమ్మెల్యే అభ్యర్ధులతో సంబంధం లేకుండా తమకు అన్ని నియోజకవర్గాల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగిందని వారి వాదన. ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కొండపి , ఒంగోలు నియోజక వర్గాల్లో క్రాస్ ఓటింగ్ ప్రభావం శిద్ధాకు అనుకూలంగా జరిగినట్టు టిడిపి వర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.ఒంగోలు, దర్శి నియోజకవర్గాల్లో భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ అనుకూలంగా జరిగింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గ బాధ్యతలను పూర్తిగా తలకెత్తుకున్న శిద్ధా అక్కడ వైసీపీ మెజార్టీని చాలావరకు తగ్గించేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. శిద్ధా 35 – 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ధీమాతో ఉన్నారు. ఇక్కడ 1999లో టిడిపి నుంచి పోటీ చేసిన కరణం బలరాం ఎలాంటి సంచలన విజయం సాధించారో ? ఇప్పుడు శిద్ధా కూడా అంతే సంచ‌ల‌నం న‌మోదు చెయ్య‌బోతున్నార‌ని టీడీపీ ధీమాతో ఉంది. ఏదేమైనా ఒంగోలు అసెంబ్లీ స్థానంలో టీడీపీ జెండా ఎగిరితే అది సంచ‌ల‌న‌మే. ఇక ఇప్ప‌టికే రెండు అసెంబ్లీ స్థానాలు వైసీపీకి, ఒక అసెంబ్లీ స్థానంలో టీడీపీకి దాదాపు విజ‌యం ఖరారు కాగా మిగిలిన నాలుగు సెగ్మెంట్ల‌లో ఇరు పార్టీల మ‌ధ్య హోరా హోరీ పోరు ఉంది. మ‌రి తుది ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts