Highlights
టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్
ప్రముఖ హిందూ మఠాల్లో ఒకటైన శ్రీ కంచి కామకోటి మఠం 69వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీజయేంద్ర సరస్వతి(82) శివైక్యం చెందడంపై టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవోలు శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, శ్రీ పోల భాస్కర్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. హిందూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా టిటిడి నిర్వహించిన పలు ధార్మిక కార్యక్రమాలకు కంచి స్వామి అందించిన సహకారాన్ని మరువలేమని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా వారితో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
శ్రీ జయేంద్ర సరస్వతి సూచనల మేరకు 1994వ సంవత్సరం నుండి టిటిడి వరుణజపంతోపాటు కారీరిష్టి యాగాన్ని నిర్వహిస్తోంది. 2017 మే 29 నుంచి జూన్ 2వ తేదీ వరకు శ్రీ జయేంద్ర సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో కారీరిష్టి యాగం జరిగింది. భక్తులకు నిస్వార్థ సేవలు అందించేందుకు ఉద్దేశించిన ”శ్రీవారి సేవ” 2000వ సంవత్సరంలో శ్రీ జయేంద్ర సరస్వతి చేతులమీదుగా ప్రారంభమైంది. 2004, అక్టోబరు 1వ తేదీన రూ.1.5 కోట్లు విలువైన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని శ్రీ జయేంద్ర సరస్వతి తిరుమల శ్రీవారికి కానుకగా అందించారు. 9.63 కిలోల బరువుగల ఈ కిరీటంలో 2060 వజ్రాలు, 200కు పైగా కెంపులు, 5 పచ్చలు ఉన్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థానమండపంలో జరిగిన సనాతన ధార్మిక సదస్సుల్లో పలుమార్లు శ్రీ జయేంద్ర సరస్వతి పాల్గొని అమూల్యమైన పలు సూచనలు చేశారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో పలుమార్లు శ్రీ జయేంద్ర సరస్వతి ధార్మికోపన్యాసాలిచ్చారు.