ఐదో విడత ఎన్నికల సందర్భంగా బిహార్ ముజఫర్‌పూర్‌లోని ఓ హోటల్‌లో రెండు ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో పాటు ఒక కంట్రోల్ యూనిట్ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు హోటల్‌కు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి ముజఫర్‌పూర్ ఎస్‌డీఓ కుందన్ కుమార్ చేరుకొని ఈవీఎంలను స్వాధీనం చేసుకున్నారు.. ఈవీఎంలు హోటల్‌కు ఎలా చేరాయన్న దానిపై మరింత లోతైన విచారణ జరుపుతామని తెలిపారు.సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే అవి సాంకేతిక సమస్యలు తలెత్తిన చోట మార్చడానికి ఏర్పాటు చేసిన అదనపు యంత్రాలని వాటికి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ఎన్నికల అధికారి అవదేశ్ కుమార్ తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ పోలింగ్ బూత్‌లో సమస్యని పరిష్కరించి వస్తుండగా.. మధ్యలో కారు డ్రైవర్ ఓటు వేసేందుకు వెళ్లడంతో వాటిని భద్రంగా ఉంచడం కోసం హోటల్‌కు తరలించానని ఆయన వివరించారు. అయితే ఇది నిబంధనలకు వ్యతిరేకం కావడంతో అవదేశ్ కుమార్‌కు ఎన్నికల సంఘం సంజాయిషీ నోటీసులు జారీ చేసింది. . దీనిపై జిల్లా మెజిస్ట్రేట్ ఆలోక్ రంజన్ ఘోష్ స్పందిస్తూ.. స్వాధీనం చేసుకున్న ఈవీఎంలు సమస్యలు తలెత్తిన చోట ఏర్పాటు చేయడానికి ఇచ్చిన అదనపు యంత్రాలని ధ్రువీకరించారు. అయితే ఈవీఎంలను హోటళ్లకు తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమని.. అందుకు సదరు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.