ఎండల తీవ్రతతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో రియల్‌టైం గవర్నెన్స్ ( ఆర్టీజీఎస్) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వడగాల్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వీలైనంత వరకు చల్లని ప్రదేశాల్లోనే ఉండాలని కోరింది. మధ్యాహ్నం 11.30 గంటల వరకు వివిధ జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను ఆర్టీజీఎస్ వెల్లడించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయిని తెలిపింది. కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల 43 నుంచి 45డిగ్రీలు రికార్టయినట్లు వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు జల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు ఆర్టీజీఎస్ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 170 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైనట్లు ఆర్టీజీఎస్ తెలిపింది. 9 మండలాల్లో 43 డిగ్రీలు, 19 మండలాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. ఈ నెల 10వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ హెచ్చరించింది.