ఇండోనేషియాలోని సినాబంగ్ అగ్నిపర్వతం ఈరోజు బద్దలైంది. ఈ సందర్భంగా అందులో నుంచి వచ్చిన బూడిద, పొగ దాదాపు 6,500 అడుగుల ఎత్తు వరకు కమ్ముకున్నాయి. దీని కారణంగా చుట్టు పక్కల ఉన్న గ్రామాలను బూడిద కమ్మేస్తోంది.సినాబంగ్ అగ్నిపర్వతం సుమత్రా దీవుల్లో ఉంది. 400 సంవత్సరాల తర్వాత 2010 నుంచి క్రియాశీలకంగా మారిన ఈ అగ్ని పర్వతం 2013లో బద్దలైంది. అప్పటి నుంచి అది యాక్టివ్ గానే ఉంది. 2014లో అగ్నిపర్వతం పేలుడు కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2016లో మరో ఏడుగురు చనిపోయారు. గత కొన్ని రోజుల నుంచి మళ్లీ క్రియాశీలకంగా మారుతూ వచ్చిన ఈ అగ్ని పర్వతం, ఈరోజు మరోసారి నిప్పులు ఎగజిమ్మింది.అగ్నిపర్వతం నుంచి లావా ప్రవహించే అవకాశం ఉండటంతో, ప్రభావిత గ్రామాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరైనా చనిపోయారా? లేక గాయపడ్డారా? అనే సమాచారం వెల్లడి కాలేదు. ఈ అగ్నిపర్వతానికి సంబంధించిన 'నో-గో' జోన్ లో ఎవరూ నివాసం ఉండక పోవడం గమనార్హం. ఇండోనేషియాలో దాదాపు 130 అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉన్నాయనేది ఒక అంచనా.