ఏపీ రాజధాని అమరావతిలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలుల కారణంగా సచివాలయం ప్రాంగణంలో రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్ (ఆర్టీజీఎస్సీ) కోసం ఏర్పాటు చేసిన ‘స్మార్ట్ పోల్’ కూలిపోయింది. సచివాలయంలోని రెండో, నాలుగు బ్లాక్ ల్లోని టెర్రస్ లపై రేకులు ఎగిరిపోయాయి. సుమారు ఐదు నిమిషాల పాటు ఈదురు గాలులు వీచాయి. ‘స్మార్ట్ పోల్’ ను రూ.25 లక్షలతో ఏర్పాటు చేసినట్టు సమాచారం. హైకోర్టు వద్ద ఉన్న క్యాంటీన్ పైకప్పు రేకులు ఎగిరి కిందపడే సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళకు ఈ రేకులు తగిలి గాయాలయ్యాయి. ఆ మహిళను సమీప ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం..రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరించింది. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం పట్ల ఆర్టీజీఎస్ అప్రమత్తమైంది. కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖ, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులు పడొచ్చంటూ హెచ్చరికలు జారీచేసింది. గుంటూరు జిల్లాలో తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, దుగ్గిరాల మండలాల్లో పిడుగులు పడొచ్చని తెలిపింది.కృష్ణా జిల్లాలో విజయవాడ, పెనమలూరు, నూజివీడు, బాపులపాడు, పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాంతాలకు రాగల 40 నిమిషాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కాగా, విజయవాడ, అమరావతిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు హోర్డింగ్ లు, కటౌట్లు ధ్వంసమయ్యాయి. దాంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.