యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
ఏపీ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది. ఈ సారి గెలుపు తమదే అని ప్రతిపక్ష వైసీపీ నమ్మకంగా చెబుతుంటే... విజయం మనదే అని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. అభ్యర్థులంతా ఫలితాలు వెలువడే మే 23 కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి హోరాహోరీ పోరు తప్పదనే భావనలో ఉన్న ఏపీలో అధికార టీడీపీ... ఫలితాలు వచ్చిన తరువాత తమ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు చేయి దాటిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. తమ పార్టీ తరపున కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న నేతలతో... వైసీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని... అలాంటి వాటికి పక్కా ఆధారాలు సేకరించాలని పార్టీ నేతలతో జరిపిన సమావేశాల్లోనూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీలో కొందరు నేతలపై పార్టీ అధిష్టానం నిఘా పెట్టిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎన్నికల తరువాత వైసీపీ వైపు వెళ్లాలని చూస్తున్న నాయకులు ఎవరు... వైసీపీ ఎవరిని తమ వైపు తిప్పుకోవాలని చూస్తోందనే అంశాలపై టీడీపీ అధిష్టానం జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. తమకు మెజార్టీ రాకపోతే... ఏదో రకంగా టీడీపీ వారిని లాక్కోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తారనే భావనలో ఉన్న టీడీపీ నాయకత్వం... అలాంటి వాటికి తావివ్వకూడదనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలెవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే... వెంటనే పార్టీ నాయకత్వానికి సమాచారం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం... పార్టీ అభ్యర్థులకు సూచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమపై పార్టీ నాయకత్వం నిఘా పెట్టిందేమో అనే టెన్షన్ కూడా కొందరు టీడీపీ అభ్యర్థుల్లో ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్న టీడీపీ... ఈ విషయంలో అస్సలు ఛాన్స్ తీసుకోవద్దని భావిస్తోందని... అందుకే కొందరు నేతలపై నిఘా పెట్టిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.