యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
రాయలసీమలోని రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. ఇక్కడ నుంచి అనేక మంది మేధావులు రాజకీ యాల్లో రాణించారు. కొందరు సీఎంలుగా కూడా పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు. అలాంటి రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ ఏ రేంజ్‌లో దూసుకుపోతోంది? ఎవరు ఎలాంటి ఫలితం ఆశిస్తున్నారు? వంటి కీలక విషయాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో కర్నూలు సిటీ నియోజకవర్గాన్ని వైసీపీ హస్తగతం చేసుకుంది. ఇక్కడ నుంచి ఎస్వీ మోహన్‌రెడ్డి విజయం సాధించారు. అయితే, అనంతర కాలంలో ఇక్కడ జరిగిన రాజకీయ మార్పుల కారణంగా ఆయన టీడీపీలోకి జంప్ చేశారు.వాస్తవానికి ఎస్వీ మంత్రి పదవిని కూడా ఆశించారు. కానీ, ఆయనకు దక్కలేదు. ఆయన మేనకోడలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు మంత్రి పదవి రావడంతో భూమా ఫ్యామిలీ కోటా అక్కడితో సరిపోయింది. ఇక, ఎన్నికల సమయానికి ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. టీడీపీ పాతమిత్రుడు టీడీ వెంకటేష్ ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన టీడీపీలో కర్నూలు టికెట్‌ను తన కుమారుడు టీజీ భరత్‌కు ఇప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ఆరు మాసాల ముందుగానే భరత్ పాదయాత్ర నిర్వహించారు. దీంతో ఎస్వీ, భరత్‌ల మధ్య టికెట్ యుద్ధం జరిగింది. అయితే, తీరా ఎన్నికల సమయానికి వచ్చేసరికి చంద్రబాబు భరత్ వైపు మొగ్గారు. దీంతో అలిగిన ఎస్వీ వెంటనే తన పాతగూడు వైసీపీలోకి జంప్ చేసేశారు.ఇక, ఇదేసమయంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించి, తర్వాత చంద్రబాబుకు మద్దతు పలికారు. అయితే, ఎన్నికల సమయానికి టికెట్‌లభించకపోవడంతో ఆమె కూడా వైసీపీ గూటికి చేరిపోయారు. ఇక, ఎన్నికల విషయానికి వస్తే. టీడీపీ టీజీ భరత్‌కు టికెట్ ఇచ్చింది. అయితే, మైనార్టీ వర్గం ఎక్కువగా ఉన్న కర్నూలులో జగన్ వ్యూహాత్మకంగా అబ్దుల్ హఫీజ్ ఖాన్ అనే మైనార్టీకి టికెట్ ఇచ్చారు. దీనివల్ల ఒక్క ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీగా వైసీపీకి గుర్తింపు లభించింది. దీంతో బుట్టా, ఎస్వీలు వైసీపీని గెలిపించాలని, టీడీపీకి యాంటీగా ప్రచారం చేయడం వైసీపీకి కలిసివచ్చిందని అంటున్నారు.
అయితే, కాంగ్రెస్ దిగ్గజం కోట్ల సూర్యప్రకాశరెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించి ఆయనకు కర్నూలు ఎంపీటికెట్ ఇవ్వడం ఇక్కడ టీడీపీకి మేలు చేస్తుందని అంటున్నారు. టీజీ భరత్‌కు దూకుడు ఎక్కువనే ప్రచారం ఉండడం మైనస్ అయింది. అయితే, ఆర్థికంగా బలంగా ఉన్న టీజీ భారీగానే ఎన్నికలకు డబ్బు ఖర్చుచేయడం ఆయనకు కలసి వస్తున్న పరిణామం. ఇక, వైసీపీ అభ్యర్థి ఖాన్ మైనార్టీ వర్గానికి చెందిన నాయకుడు కావడం, ఆయనకు బలమైన ప్రచారం లభించడం, గతంలోనూ ఇక్కడ మైనార్టీ అభ్యర్థి విజయం సాధించిన పరిస్థితి ఉండడంతో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.