YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేనకు న్యూట్రల్ ఓటింగ్

జనసేనకు న్యూట్రల్ ఓటింగ్

యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:

ఎస్ ..ఇప్పుడు పవన్ కల్యాణ్ హాట్ కేక్. సినిమారంగంనుంచి పూర్తిస్థాయి రాజకీయవేత్తగా మారేవరకూ నంబర్ వన్ స్థానంలోనే కొనసాగాడు. కోట్లాదిరూపాయల ఆదాయాన్ని వదులుకుని వచ్చేశాడు. లక్షలాది అభిమానుల అండగా జనసేనకు ఊపిరిపోశాడు. సినిమాల కంటే తనకు ప్రజలే ముఖ్యమని చెప్పేశాడు. ఇది పక్కా అంటూ లెక్క తేల్చేశాడు. ఇప్పుడు ఎటు చూసినా జనసేన మూడో పక్షంగా ఉంటుందని జనాభిప్రాయం నిశ్చితంగా వెల్లడవుతోంది. అటు వైసీపీ, ఇటు టీడీపీల రాష్ట్రస్థాయి రాజకీయ చతురోపాయాలు, ఆర్థిక,అంగ బలాల ముందు ఎంతో కొంత నైతికతతో పోరాడిన పార్టీగా జనసేనకు తటస్థులు మార్కులు వేస్తున్నారు. కానీ అధికారానికి అది సరిపోదు. నైతిక సూత్రాలు నంబర్ గేమ్ ను మార్చలేవు. అందుకే మా పవర్ స్టార్ మళ్లీ రావాలంటూ కోరుతున్న అభిమానుల సందడి పెరిగిపోతోంది. రాజకీయంగా మధ్యేవాద పాత్ర పోషిస్తూ మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని ఏడాదికో సినిమా అయినా చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. దీనికి అనేక రకాల లాజిక్కులు సమకూర్చి చెబుతున్నారు. సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో నిలదొక్కుకోవచ్చునంటున్నారు. అయితే పవర్ స్టార్ దీనిని ఎంతవరకూ అంగీకరిస్తారు. తనకొద్దు అనుకున్న రంగానికి తిరిగి వెళతారా? అనేదే ప్రశ్న.పవన్ కల్యాణ్ కు అభిమానులే బలం. తీసిన సినిమాల్లో మూడొంతులు అట్టర్ ప్లాఫ్ అయినా నెత్తిన కూర్చోబెట్టుకున్నారు. హిట్, ప్లాఫ్ ల తో సంబంధం లేకుండా ఆదరించి అగ్రస్థానం కట్టబెట్టారు. తమ హీరో మరిన్ని సినిమాలు తీయాలని, వినోదం పంచాలని వారు కోరుకుంటూనే ఉంటారు. అందుకే రాజకీయాల్లోకి వస్తాను. ఇక సినిమాలు చేయను అని ప్రకటించినప్పుడు ప్రతి ఒక్క అభిమాని ఎంతోకొంత బాద పడ్డాడు. అందులోనూ చిరంజీవి ప్రజారాజ్యం వైఫల్యం కారణంగా అనేక సందేహాలనూ వ్యక్తం చేశారు. సినిమాలు, రాజకీయాలు రెండూ చేయాలని చాలా మంది డిమాండ్ చేశారు. అయితే తన జీవితం ప్రజాసేవకే అంకితం అన్నట్టుగా ప్రకటన చేసి పవర్ స్టార్ సినిమాలకు బైబై చెప్పేశాడు. దాంతో ఒక స్థిరనిర్ణయానికి వచ్చిన అభిమానులు పార్టీ కోసం పనిచేశారు. ఒక నలభై వరకూ నియోజకవర్గాల్లో జనసేన బలమైన ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. ఇందుకు ప్రదాన కారణం అభిమానులే. అయితే అధికారం చేజిక్కించుకునే అవకాశాలేమాత్రం లేవని ఫ్యాన్స్ సైతం అంగీకరిస్తున్నారు. అందులోనూ 20,30 సీట్లతో పవర్ పగ్గాలు చేపడితే దినదినగండం బ్రతుకుగా మారుతుంది. తమ అధినేత అభీష్టానికే అది విరుద్ధం. కాబట్టి ఈసారికి అటువంటి ఆశలేమీ పెట్టుకోవడం లేదు. దానికి ప్రత్యామ్నాయంగా కొత్త డిమాండును తెరపైకి తెస్తున్నారు. మళ్లీ సినిమాల్లోకి రావాలనేది ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఒత్తిడి.సినీరంగ పున: ప్రవేశాన్ని పవన్ అంగీకరిస్తారా? లేదా అనేది వేరే విషయం. కానీ డిమాండ్ వైరల్ గా మారుతోంది. పవన్ అభిమానులకున్న బలం సోషల్ మీడియా. కేవలం పవర్ స్టార్ తో వైరం కారణంగా ఎందరెందరికో సోషల్ మీడియా సెలబ్రిటీ స్టేటస్ కల్పించారు అభిమానులు. కావాలని కాదు , కేవలం వాళ్లతో గొడవ పెట్టుకుని లక్షలాది మందికి ఆసక్తి రేకెత్తించారు. అందుకే పవన్ మీద ఏదేని కామెంట్ చేయాలంటే మర్యాదస్థులు భయపడతారు. అభిమానులు ఎలా విరుచుకుపడతారో అనే సందేహంతో గమ్మున ఊరుకుంటారు. అదే ప్రచారం కావాలనుకున్నవారు పవన్ పై ఏదో ఒకటి మాట్టాడి పబ్లిక్ స్టార్ గా మారుతుంటారు. ఇక్కడ పవర్ స్టార్ కు అభిమానులే బలహీనత. ఊరూపేరులేనివారితో సైతం గొడవకు దిగి వారిని ప్రచార తారలుగా మార్చి తలనొప్పులు తెచ్చిపెడుతుంటారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం ఒకరకంగా చెప్పాలంటే అభిమానుల కారణంగానే అత్యంత వివాదాస్పదంగా చర్చల్లో నలిగింది. సినిమాల్లోకి వచ్చి తమను అలరించాలని కోరుతున్న వారి సంఖ్య సైతం రోజురోజుకీ బలపడుతోంది. పైపెచ్చు దర్శకులు ఎవరు? కథ ఎలా ఉంటుంది? హీరోయిన్ ఎవరు? వంటి చర్చలు సైతం సాగిపోతున్నాయి.రాజకీయమంటే కేవలం అధికారం కాదు. ఈ విషయాన్ని అనేకమార్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలతో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాటమే అదికారానికి లక్ష్యమూ. గమ్యమూ. కమ్యూనిస్టులు సహా అనేక పార్టీలు చాలావరకూ అధికారంలోకి రావు. అయినా తమ ఉనికిని కాపాడుకుంటూ ప్రజలతో ఉంటూ వస్తుంటాయి. పార్టీ పెట్టిన వెంటనే అధికారం రాలేదని మూసేస్తే నాయకుడి బలహీనత బట్టబయలైపోతుంది. ప్రజారాజ్యం విషయంలో జరిగిందదే. ఇప్పుడు మళ్లీ జనసేనను నమ్మి కొన్ని లక్షలమంది ఓట్లు వేసి ఉంటారు. తిరిగి సినిమా వినోదం వైపు మళ్లి రెండు పడవలపై కాళ్లు వేస్తే నష్టపోయేదెవరు? కొత్త పార్టీలను ప్రజలు ఎందుకు నమ్ముతారు? రెంటికీ చెడ్డ రేవడిగా మారితే అభిమానులు బాధ్యత వహిస్తారా? నూతన రాజకీయం రావాలని కోరుకుంటున్న లక్షలాది ప్రజల ఆశలపై నీళ్లు చిలకరించినట్లు కాదా? అందుకే ఇది కేవలం పవన్ కెరియర్ కు సంబంధించిన విషయమో, వ్యక్తిగత అంశమో కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో ముడిపడిన కీలక విషయం. ఆచితూచి నిర్ణయించుకోవాల్సిన తరుణం. పవర్ స్టార్ అభిమానుల డిమాండ్ కు తలొగ్గుతారో, కాదంటూ తన అభిమతాన్నే అనుసరిస్తారో వేచి చూడాల్సిందే.

Related Posts