యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ లో ముసలం పుట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. మిత్రపక్షాల మధ్య సయోధ్య కుదరడం లేదు. లోక్ సభ ఎన్నికల సీట్ల పంపకాల్లో తేడా, అనేక నియోజకవర్గాల్లో క్యాడర్, లీడర్లు కలసి పనిచేయకపోవడంతో రెండు పార్టీల అగ్రనేతలు బహిరంగంగానే కారాలు, మిరియాలు నూరుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో తేడా కనుక వస్తే ఇవి మరింత దూరం పెంచే అవకాశాలున్నాయి. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయోనన్న సందిగ్దత రెండు పార్టీల్లోనూ నెలకొని ఉంది.ముఖ్యమంత్రి కుమారస్వామి జేడీఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మాండ్యా నియోజకవర్గలో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ తన కుమారుడు నిఖిల్ గౌడకు సహకారం అందించలేదని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. సహకరించని కాంగ్రెస్ నేతలపై వేటు వేయాలని కుమారస్వామి ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలను కోరారు. వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు.ఇంటలిజెన్స్ నివేదిక ప్రకారం మాండ్య నియోజకవర్గంలో కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని గుర్తించారు. ఈ జాబితాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి కుమారస్వామి పంపనున్నారు. క్యాడర్ కలసి రాకపోవడానికి కారణం ప్రధానంగా నేతలేనని కుమారస్వామి చెబుతున్నారు. మిత్ర ధర్మానికి తూట్లు పొడిచిన వారిని కాంగ్రెస్ చూసీ చూడనట్లు వ్యవహరించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. నిజంగా నిఖిల్ గౌడకు ఓటమి ఎదురైతే కుమారస్వామి ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందన్న ఆందోళన జనతాదళ్ ఎస్ నేతల్లోనూ లేకపోలేదు.అయితే కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం కుమారస్వామి కోరినట్లు ఒక్క వీడియో ఆధారంగా చర్యలు తీసుకోలేమని చెబుతున్నారు. కర్ణాటక పీసీీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో కుమారస్వామి మరింత రగలిపోతున్నారు. కొడుకు విజయం కోసం ఆయన హోమాలు కూడా నిర్వహించారు. కాంగ్రెస్ కూడా మైసూరు ప్రాంతంలో జనతాదళ్ ఎస్ నేతలు సహకరించలేదని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మంత్రి జిటి దేవెగౌడ చేసిన వ్యాఖ్యలను వారు ఉదహరిస్తున్నారు. జిటి దేవెగౌడపై చర్యలు ఎందుకు తీసుకోరని కాంగ్రెస్ పార్టీ ఎదురు ప్రశ్నలు వేస్తోంది. మొత్తం మీద కర్ణాటక రాజకీయాలను ఈ లోక్ సభ ఎన్నికల ఫలితాలు పూర్తిగా మార్చివేస్తాయన్నది మాత్రం వాస్తవం.