YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అంతు చిక్కని మాయా వ్యూహం

 అంతు చిక్కని మాయా వ్యూహం

యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:

గ్రాండ్ ఓల్డ్ పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాలిటిక్స్ ప్లే చేస్తోంది. రాహుల్ గాంధీని ఎలాగైనా ప్రధాని పదవి పైన కూర్చోబెట్టాలన్నది టెన్ జన్ పథ్ లక్ష్యం. కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ ఇదే పనిమీద ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కు అనుకూలమైన వాతావరణం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ తగ్గిపోవడంతో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే రాహుల్ ప్రధాని పదవి చేపట్టడానికి ఎవరూ అడ్డం పడకుండా ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి రాహుల్ ప్రధాని కాకుండా అడ్డుపడతారన్న అనుమానం కాంగ్రెస్ లో తొలినుంచి బలంగా ఉంది. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ను కూటమిలో చేర్చుకోకుండా పక్కన పెట్టడానికి కూడా మాయావతి కారణమని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. కాంగ్రెస్ కు యూపీలో రెండు స్థానాలకే పరిమితం చేసి కలసి వస్తే ప్రధాని పీఠం ఎక్కాలన్న మాయా వ్యూహానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావించి, అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంది.కాంగ్రెస్ ప్రధానంగా రెండు వ్యూహాలను అమలు చేస్తోంది. ఒకటి బీజేపీకి ఎక్కువ సీట్లు రాకుండా చూడటం. రెండు మాయావతిని తక్కువ సీట్లకు పరిమితం చేయడం. ఈ రెండింటిలో సక్సెస్ అయితే రాహుల్ కు ఎదురులేనట్లే. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ కొంత కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉంది. అఖిలేష్ యాదవ్ తో ఎలాంటి ప్రమాదం లేదని తెలుసు. అందుకే మాయావతిపైనే కాంగ్రెస్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనపడుతోంది. బహుజన్ సమాజ్ పార్టీపై రాహుల్, ప్రియాంక గాంధీలు ఒంటికాలిపై లేస్తున్నారు.ఇందులో భాగంగానే యూపీలో బహుజన్ సమాజ్ పార్టీ బలంగా ఉన్న నలభై స్థానాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా, బీఎస్పీ అభ్యర్థుల ఓటమికి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మాయావతికి చెక్ పెట్టడానికి దళితనేతగా ఎదుగుతున్న భీమ్ ఆర్మీ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ ను చేరదీసింది. మాయావతికి నమ్మకమైన వ్యక్తిగా పేరున్న నేత నజిముద్దీన్ సిద్ధిఖీని కాంగ్రెస్ అక్కున చేర్చుకుంది. ఇలా బీఎస్పీ బలంగా ఉన్న దాదాపు 23 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహాన్ని అమలుపర్చింది. ప్రియాంకగాంధీ నేతృత్వంలోనే ఈ ఆపరేషన్ జరగడం విశేషం. ఇలా మాయావతికి ముందుగానే చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.

Related Posts