యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పోలవరం ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతుల అంశంపై జోక్యం చేసుకోలేమని ఎన్జీటీ ధర్మాసనం స్పష్టం చేసింది. పోలవరం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి గండి పడుతుందంటూ ఎన్జీటీలో దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. 2005లో పర్యావరణ అనుమతులు ఇస్తే.. ఈ పిటిషన్‌లో వాటినే సవాలు చేశారని ఇప్పుడు దీనిపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతిలిచ్చిన 90 రోజుల్లోనే ఏమైనా అభ్యంతరాలు ఉంటే పిటిషన్ వేయాలని ఎన్జీటీ తెలిపింది. మత్స్యకారుల జీవనోపాధి అంశమైనా.. పర్యావరణ అనుమతులపైనే సవాల్ చేస్తూ పిటిషన్ వేశారని అయినా ఇంత ఆలస్యంగా పిటిషన్ ఎందుకు వేశారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఎన్జీటీ ప్రశ్నించింది. కాగా తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే పోలవరం వల్ల మత్స్యకారులకు నష్టం జరిగేటట్లయితే ఫోరమ్‌లను ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు ఎన్జీటీ సూచించింది.