యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శ్రీలంకలో ఉగ్రదాడి తర్వాత ముష్కరమూకలు భారత్‌లో చొరబడే అవకాశం ఉందంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. కొలంబో దాడుల తర్వాత భద్రతా బలగాలు.. దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల ఎరివేత కార్యక్రమాన్ని చేపట్టాయి.. శ్రీలంకలో ఉగ్రస్థావరాలపై విరుచుకుపడ్డాయి. దీంతో ముష్కరులు సముద్ర మార్గం ద్వారా పారిపోయారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అక్కడి నుంచి పారిపోయిన ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే అవకాశముందని కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. భారతదేశంలో చొరబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సముద్ర తీరంలో ఉన్న రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీ డీజీపీని అలర్ట్ చేశాయి నిఘా వర్గాలు. దీంతో డీజీపీ ఆర్పీ ఠాకూర్ బుధవారం పోలీస్‌శాఖ అధికారులతో అత్యవసరంగా సమీక్ష చేశారు. అన్ని జిల్లాల ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రతకు సంబంధించి డీజీపీ పలు సూచనలు చేశారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను గుర్తించి.. అక్కడ భద్రతను పెంచాలని ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని.. వాహనాలు, హోటళ్లలో తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఎక్కడైనా భద్రతా లోపాలుంటే సరిచేయాలని.. మళ్లీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు