యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో: అద్భుత ఆట తీరుతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ టైటిల్‌కు చేరువగా వచ్చింది. టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతున్న ఆ జట్టు ఎలిమినేటర్‌లోనూ అదే ఆటతీరు కనబరిచింది. బుధవారం ఇక్కడ జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 162/8 స్కోరు చేసింది. గప్టిల్ (19 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 36), మనీష్ పాండే (36 బంతుల్లో 3 ఫోర్లతో 30), కేన్ విలియమ్సన్ (27 బంతుల్లో 2 ఫోర్లతో 28), విజయ్ శంకర్ (11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25) మాత్రమే రాణించారు. ఇషాంత్ శర్మ రెండు, కీమో పాల్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ 19.5 ఓవర్లలో 165/8తో విజయం అందుకుంది. ఓపెనర్ పృథ్వీ షా (38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీ చేయగా.. పంత్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 49) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ధవన్ (16 బంతుల్లో 3 ఫోర్లతో 17) పర్లేదనిపించాడు. భువనేశ్వర్, ఖలీల్, రషీద్ ఖాన్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. పంత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. శుక్రవారం ఇక్కడే జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో చెన్నైతో ఢిల్లీ అమీతుమీ తేల్చుకుంటుంది.