యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ కు లోక్ సభ ఎన్నికలు కీలకం కానున్నాయి. మొత్తం 40 లోక్ సభ నియోజకవర్గాలున్న బీహార్ లో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలన్న వ్యూహంలో నితీష్ కుమార్ ఉన్నారు. ఆయన ప్రచారం కూడా విభిన్న శైలిలో కొనసాగింది. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునే విధంగా నితీష్ తన ప్రచారాన్ని కొనసాగించారు. మద్యనిషేధం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించి నితీష్ కు అనుకూలంగా మారే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అంచనా. ఒకప్పటి లాలూ ప్రసాద్ యాదవ్ పాత మిత్రుడైన నితీష్ కుమార్ ఈసారి ముందుచూపుతో వ్యవహరించారంటున్నారు. లాలూ యాదవ్ పాలనలో జరిగిన తప్పొప్పులను సరిచేసుకుంటూ ఆయన పాలన సాగించడమే కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. వెనుకబడిన తెగలతో పాటు, దళితులను తన దరిచేర్చుకోవడంలో నితీష్ సక్సెస్ అయ్యారన్నది అంచనా. అంతేకాదు అగ్రవర్ణాలు సయితం నితీష్ పాలనకు ఓటేస్తున్నారన్న సంకేతాలు కన్పిస్తున్నాయి.గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాగడ్బందన్ పేరుతో బరిలోకి దిగి అధికారంలోకి వచ్చిన నితీష్ కుమార్ అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా పాలన చేపట్టారు. ముఖ్యంగా లాలూ యాదవ్ పాలనపై గుర్రుగా ఉన్న అగ్రవర్ణాలను ఆయన మంచి చేసుకున్నారు. లాలూ యాదవ్ తో మిత్రత్వం ముగిసిన తర్వాత బీజేపీ మద్దతు తెచ్చుకున్నా ఆయనను ప్రజలు పెద్దగా తప్పు పట్టకపోవడం విశేషం. అయితే మోదీ ఇమేజ్ తగ్గడంతో కొంత ఇబ్బంది ఎదురవుతున్నా నితీష్ తన దైన శైలిలో ప్రచారం చేసి అభ్యర్థుల గెలుపునకు దోహదపడ్డారన్న వ్యాఖ్యలు విపక్ష పార్టీల నుంచే విన్పించాయి.మరోవైపు లాలూ యాదవ్ పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్ లో కూడా తలెత్తిన మనస్పర్థలు ఆయనకు కలసి వచ్చే అవకాశం ఉంది. లాలూ కుటుంబంలో తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ ల మధ్య విభేదాలతో యాదవ ఓట్లలో చీలిక వస్తుందని భావిస్తున్నారు. ఆర్జేడీ ఉప ఎన్నికలలో గెలవడమొక్కటే ప్లస్ పాయింట్ గా కన్పిస్తోంది. అంతేకాకుండా లాలూ యాదవ్ ను జైలుకు పంపడంతో కొంత సానుభూతి బీహార్ లో కన్పిస్తోంది. ఆయనకు బెయిల్ రాకపోవడానికి రాజకీయ కక్ష సాధింపే కారణమన్నది జనంలోకి బలంగా వెళ్లింది. అయితే నితీష్ కుమార్ మాత్రం తమ కూటమి అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.