యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్ణాటకలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం మాండ్య. ఇప్పుడు ముఖ్యమంత్రి కుమారస్వామికి దడ పుట్టిస్తుంది కూడా మాండ్య నియోజకవర్గమే. కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాల్లో జనతాదళ్ ఎస్ ఏడు స్థానాల్లోనూ, కాంగ్రెస్ 21 స్థానాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. దళపతి దేవెగౌడ కుటుంబ సభ్యులు ఏడింటిలో మూడు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. తుముకూరులో దేెవెగౌడ, హాసన్ లో రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్, మాండ్యలో కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేసిన సంగతి తెలిసిందే.అయితే తుముకూరు, హాసన్ లలో దేవెగౌడ, ప్రజ్వల్ విజయావకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. మాండ్య నియోజకవర్గంలో మాత్రం నిఖిల్ గౌడ గెలుపు అంత సులువు కాదన్నది తేలింది. ముఖ్యంగా ఇంటలిజెన్స్ నివేదికలు ప్రకారం మాండ్యలో నిఖిల్ గౌడ గెలుపోటముల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని తేలడంతో కుమారస్వామిలో ఆందోళన బయలుదేరింది. అంతేకాదు కుమారుడి గెలుపు కోసం హోమాలు కూడా చేయిస్తున్నారు. గుళ్లు, గోపురాలు తిరుగుతూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.మాండ్యలో సుమలత గట్టి పోటీ ఇచ్చారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిని ప్రకటించకుండా స్వతంత్ర అభ్యర్థి సుమలతను బలపర్చడంతో పోటీ సంక్లిష్టంగా మారింది. దీనికి తోడు జనతాదళ్ ఎస్ కుటుంబ రాజకీయాలపై నియోజకవర్గంలో వ్యతిరేకత బయలుదేరిందంటున్నారు. అంబరీష్ మరణంతో సానుభూతి పవనాలు సుమలత వైపు బలంగా వీచాయంటున్నారు. దీంతో కుమారస్వామి తనయుడు అరంగేట్రంలోనే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీనికి తోడు మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ లో పాల్గొనడం సుమలతకు కలసి వచ్చిందంటున్నారు. మహిళలు ఓట్లు సుమలతకే ఎక్కువగా పడ్డాయన్నది ఇంటలిజెన్స్ నివేదిక సారాంశం. అలాగే ఇక్కడ రైతాంగం ఎక్కువగా ఉంది. ప్రధాన రైతు సంఘాలన్నీ సుమలత పక్షానే నిలవడం కూడా కుమారస్వామిలో కలవరం రేపుతున్నాయి. దీంతోపాటు కాంగ్రెస్ క్యాడర్ కూడా సుమలతకు సహకరించడంతో ఆమె గెలిచినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నాయి. అందుకే ఈ మూడు కారణాలు కుమారస్వామిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎవరిది విజయమన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.