యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికలు ముగిసిన ఏపీలో ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు సీఎం సీటులో కూర్చుంటారు? అనే చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలోనే అధికార టీడీపీ నుంచి పోటీ చేసిన చాలా మంత్రి ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జంపింగ్‌లకు కూడా రెడీ అయిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. గత ఎన్నిక ల్లో వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మంది ఆ పార్టీకి బై చెప్పి.. చంద్రబాబు చెంతకు చేరిపోయారు. వారి భవిష్యత్తును వారు చూసుకున్నారు. ఇక, ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే.. టీడీపీ నేతలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. వైసీపీలో గెలిచిన వారిలో జగన్‌కు బాగా కావాల్సిన వారు మినహా మిగిలిన వారు టీడీపీ గూటికి చేరిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.వైసీపీ ఇప్పటికే 8 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనూ ఉంటూ పోరాటాలు చేస్తూ వస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే మరో ఐదేళ్ల పాటు ప్రతిపక్షానికి పరిమితం కావాల్సిందే. 13 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేయడం అంటే ఏ పార్టీకి అయినా, పార్టీ నేతలకు అయినా చాలా కష్టమైన పనే. ఈ క్రమంలోనే వారు అధికార పార్టీ చెంత సేదతీరుతూ తమ భవిష్యత్తు తాము చూసుకునేందుకు రెడీ అయిపోతారు. కానీ, అలా కాకుండా జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటే.. మాత్రం కోరి కోరి చంద్రబాబు చెంతన ఉండేందుకు దాదాపు పాతిక మంది వరకు సిద్ధంగా లేరని అంటున్నారు. తాజా పరిస్థితులను అంచనా వేస్తే.. గోడమీద పిల్లుల్లాగా పాతిక మంది నాయకులు జగన్ ప్రభుత్వం ఏర్పాటైతే.. వైసీపీలోకి జంప్ చేయాలని భావిస్తున్నారని సమాచారం.ఈ సారి ఏపీలో జగన్ అధికారంలోకి వస్తే టీడీపీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు జగన్ చెంతకు చేరేందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో వారికి వ్యాపారాలు ఉండడం, ఇక్కడ కూడా అనేక లావాదేవీలు నెరుపుతుండడంతో అధికారంలో ఉన్న పార్టీ అండదండలు లేకపోతే.. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని వీరు భావిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే వారికి ఓ క్లారిటీ కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానే వచ్చేసినట్లే ఉంది. ఇలాంటి వారిలో గుంటూరు, కృష్ణా, విశాఖ, ప్రకాశం, నెల్లూరుకు చెందిన నాయకులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఒక మంత్రి కూడా గెలుపు గుర్రం ఎక్కి, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే.. ఆవెంటనే జగన్‌కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.ఇక, విశాఖలోనూ ఒకరిద్దరి పరిస్థితి ఇలానే ఉందని అంటున్నారు. అయితే, దీనిని టీడీపీలోని ఓ తటస్థ వర్గం మాత్రం పాజిటివ్‌గానే తీసుకుంటున్నారని సమాచారం. ఎవరి అవసరాలు వారివి. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత.. పార్టీ అధికారంలోకి రాకపోతే.. వారి స్వలాభం చూసుకుంటే తప్పేంటి? అనే వారు కూడా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఎక్కడ నుంచి విజయం సాధిస్తారు? ఎవరు అధికారంలోకి వస్తారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఆ తర్వాత జరిగే పరిణామాలపై మరింత ఉత్కంఠ నెలకొనడం గమనార్హం.