YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేన ఎఫెక్ట్ తో వైసీపీకి చుక్కలే

 జనసేన ఎఫెక్ట్ తో  వైసీపీకి చుక్కలే

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కృష్ణా జిల్లాలో పశ్చిమ కృష్ణాలో ఏలూరు లోక్‌స‌భ నియోజకవర్గం పరిధిలో విస్తరించి ఉన్న నియోజకవర్గం నూజివీడు. జమీందారుల పాలనలో కొన్ని శతాబ్దాల వైభ‌వాన్ని చూసిన‌ ఈ నియోజకవర్గం మామిడి తోటలకు ప్రసిద్ధి. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మచిలీపట్నం ఎంపీ సెగ్మెంట్‌లో ఉన్న నూజివీడు పునర్విభజన తర్వాత ఏలూరులోకి మారింది. ఈ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మరోసారి రేసులో ఉన్నారు. టిడిపి నుంచి గత ఎన్నికల్లో ఓడినా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మరోసారి పోటీ చేశారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే నూజివీడు నియోజకవర్గంలో గెలుపోటములపై రెండు పార్టీలు ధీమాగానే ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు చివరి వరకు రేసులో తన గెలుపు వ‌న్‌సైడ్‌గా ఉంటుంద‌ని ధీమాతో ఉన్నా చివ‌రిలో ఆయ‌న‌కు కొన్ని షాకులు త‌ప్పలేదు. కొన్ని దశాబ్దాలుగా ప్రతాప్‌కు రైట్ హ్యాండ్‌గా ఉంటున్న మాజీ మునిసిప‌ల్ చైర్మన్ బసవా భాస్కరరావు చివర్లో జనసేనలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.నూజివీడు మున్సిపాలిటీలో మంచి పట్టు ఉన్న భాస్కర రావు వైసీపీని వీడటం ప్రతాప్ కొంత ఇబ్బందికర పరిస్థితి. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న ప్రతాప్ ప్రజలకు చేసింది ఏమీ లేకపోయినా ఎలాంటి వివాదాలు లేకుండా తన పని తాను చేసుకు వెళ్లారు. ప్రతాప్ 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో చేసిన అభివృద్ధి ఆయనకు వ్యక్తిగతంగా ఎప్పుడూ ప్లస్ పాయింటే. టిడిపి అభ్యర్థి ముద్దరోయిన విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఓడిపోయాక నియోజకవర్గంలో ఆయన టిడిపిని ఏమాత్రం బలోపేతం చేయలేక పోయార‌న్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. నియోజకవర్గ టిడిపి ముద్ద‌ర‌బోయిన వర్సెస్ ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గాలుగా చీలి పోవడంతో ఇక్కడ టిడిపి ఐదేళ్లలో గ్రూపు తగాదాలతో కొట్టుమిట్టాడింది.టిడిపిలో మెజార్టీ కార్యకర్తలు ముద్దర‌బోయిన అభ్యర్థిత్వాన్ని చివరి వరకు తీవ్రంగా వ్యతిరేకించారు. ముద్ద‌ర‌బోయినకు సీటు వస్తుందా ? అన్న సందేహాలు చివరి వరకు ఉన్నాయి. చివరిలో బీసీ కోటాలో చంద్రబాబు రెండు గ్రూపుల మధ్య సయోధ్య చేసి ముద్ద‌ర‌బోయిన‌కే సీటు ఇచ్చారు. చంద్ర‌బాబు స‌యోధ్య కుదిర్చినా టీడీపీలోనే కొంత మంది కీల‌క కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు ఆయ‌న‌కు అనుకూలంగా చెయ్య‌లేద‌న్న టాక్ కూడా ఉంది. ఇక జనసేన ఇక్కడ గెలిచే స్కోప్‌ లేకపోయినా ఆ పార్టీ చీల్చే ఓట్లు ప్రధానంగా వైసీపీపై ప్రభావం చూపనున్నాయి. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో, జనసేన అభ్యర్థి ప్రతాప్ అప్పారావు రైట్ హ్యాండ్ కావడంతో ఆ పార్టీ భారీగా ఓట్లు చీల్చితే వైసీపీకి ఎఫెక్ట్ త‌ప్ప‌దు. నూజివీడు పట్టణంలోనే జనసేన ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు పోలింగ్ సరళి చెప్పింది.నూజివీడు మున్సిపాలిటీ ముందు నుంచి ప్రతాప్‌కు భారీ మెజారిటీ ఇస్తోంది. ఈ ఎన్నికల్లో పట్టణంలో జనసేన ఏ మేరకు ఓటు చీల్చుతుంది అన్న దానిని బట్టే ప్రతాప్‌కు టౌన్‌లో వచ్చే మెజార్టీలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పోలింగ్ ముగిశాక వైసీపీ నూజివీడు టౌన్, చాట్రాయి, ఆగిరిపల్లి మండలాల మెజార్టీతో గెలుస్తామన్న ధీమాతో ఉంది. టిడిపి లెక్కల ప్రకారం ముసునూరు, నూజివీడు రూర‌ల్‌, ఆగిరిపల్లి మండలాల‌ మెజార్టీతో గెలుస్తామని లెక్కలు వేసుకుంటోంది. నూజివీడు టౌన్‌లో వైసీపీ మెజార్టీని చాలా వరకు తగ్గించామని, జనసేన ప్రభావం వైసీపీ పైనే ఉందని చెబుతోంది. జనసేనకు గెలుస్తామన్న ఆశలు లేకపోయినా నూజివీడు పట్టణంలో మంచి మెజారిటీ వస్తుందని లెక్కల్లో ఉంది. ఈ మూడు పార్టీల అంచనాల మధ్యలో నూజివీడు రారాజుగా ఎవరు గెస్తారో ? చూడాలి.

Related Posts