YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ తో దోస్తికి కాంగ్రెస్ ప్రయత్నాలు

 జగన్ తో దోస్తికి కాంగ్రెస్ ప్రయత్నాలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

జాతీయ రాజకీయాల్లో పరిణామాలు ఎప్పుడెలా ఉంటాయో తెలియదు. అందుకే ఓ వైపు చంద్రబాబుతో స్నేహం చేస్తున్నా.. జగన్ పై అవినీతి కేసుల విషయంలో సీరియస్ గా ముందుకెళ్లేందుకు ప్రధాని మోడీ సిద్ధపడలేదు. కేంద్రంతో తెగదెంపులు చేసుకున్న తర్వాత చంద్రబాబు అండ్ కోను టార్గెట్ చేయడం కూడా ఇదే కోవలోకి వస్తుంది. తాజాగా ఏపీలో మారుతున్న పరిస్ధితుల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ అవసరం కూడా జాతీయ పార్టీలకు తక్షణావసరంగా మారింది. ఎన్నికల ఫలితాలు వచ్చాక టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ అంతా కాంగ్రెస్ కు మద్దతిస్తారంటూ టీ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ లోనూ చర్చనీయాంశం అవుతున్నాయి. హై కమాండ్ నుంచి ఏదో ఒక సంకేతం లేకుండా జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకపోవచ్చని ఏపీ కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమవాడేనని ఓసారి, జగన్ తమకు శత్రువంటూ మరోసారి వ్యూహాలు మార్చిన కాంగ్రెస్ హైకమాండ్ కు ఇప్పుడు జగన్ తక్షణావసరంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఫలితాల కన్నా ముందే కాంగ్రెస్ నేతలతో జగన్ అనుకూల స్టేట్ మెంట్లు ఇప్పించే ప్రయత్నాలు మొదలైనట్లు తాజా సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి.ఏపీలో గతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, రెడ్లు, మైనార్టీలను జగన్ తన వైపు తిప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్ర విభజన ఏపీలో కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేసింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు నిండా ముంచింది. ఈ నేపథ్యంలో జగన్ తో పొత్తు పెట్టుకుంటే మంచిదని మొన్నటి ఎన్నికలకు ముందు పలువురు ఏపీ కాంగ్రెస్ నేతలు రాహుల్ కు సూచించినా ఆయన పెద్దగా స్పందించలేదు. ఒకప్పుడు తమ పార్టీలో ఎంపీ టికెట్ కోసం క్యూలో ఉన్న జగన్‌మోహన్ రెడ్డితో పొత్తు కోసం తాము వెంపర్లాడితే జాతీయ పార్టీ ఇమేజ్ కు భంగం కలుగుతుందని రాహుల్ అప్పట్లో భావించారు. దీంతో ఏపీ కాంగ్రెస్ ప్రతిపాదన అటకెక్కింది.ప్రస్తుతం జాతీయ స్ధాయిలో గత ఎన్నికల తరహాలో మోదీ ప్రభంజనం కొనసాగే అవకాశాలు లేవని దాదాపుగా సర్వేలన్నీ తేల్చేశాయి. అయితే మ్యాజిక్ మార్కుకు 50 నుంచి 70 సీట్ల దూరంలో ఎన్డీయే నిలిచే అవకాశం ఉంటుందన్న అంచనాలున్నాయి. వీటిలో వాస్తవం ఎంతున్నా.. కాంగ్రెస్ పరిస్ధితి మాత్రం గతం కంటే మెరుగుపడే సూచనలే కనిపిస్తున్నాయి. అదే సమయంలో గతంతో పోలిస్తే కాంగ్రెస్ కు మిత్రులు కూడా పెరిగారు. అయినా మ్యాజిక్ మార్కుకు అవసరమైన 272 సీట్లను యూపీఏ సాధిస్తుందా అంటే అవునని చెప్పలేని పరిస్ధితి. దీంతో కేసీఆర్, జగన్ వంటి ప్రాంతీయ శక్తులను దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఫీలర్లు ఇవ్వడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ లోనూ ఇదే చర్చ నడుస్తోంది.జగ్గారెడ్డి తరహాలోనే త్వరలో ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా జగన్ తమ వాడే, తమకు మద్దతిస్తాడంటూ ప్రచారం ప్రారంభించబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామంటూ కాంగ్రెస్ ఎలాగో హామీ ఇచ్చింది. దీనిని కొనసాగింపుగా ప్రత్యేక హోదాకు మద్దతిస్తూ సంతకం చేసే వారికే తన మద్దతంటూ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఇదే ఫార్ములాను అందిపుచ్చుకుంటూ ప్రత్యేక హోదా ఇచ్చే తమకే జగన్ మద్దతివ్వబోతున్నారంటూ ఏపీ కాంగ్రెస్ కూడా ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ విషయంలో జగన్ వైఖరి పూర్తిగా మారిందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. అయితే ప్రత్యేక హోదా హామీపై సంతకం అన్న కారణం ఒక్కటే కాంగ్రెస్ కు జగన్ ను దగ్గర చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫార్ములా జగన్ ను కాంగ్రెస్ కు మద్దతిచ్చేలా చేస్తుందా లేదా అంటే మే 23 వరకూ వేచి చూడాల్సిందే

Related Posts