యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ కేబినెట్ భేటీ నిర్వహించి తీరుతామని బీరాలు పలికిన సీఎం చంద్రబాబుకు తత్వం బోధ పడినట్లే కనిపిస్తోంది. ఈ నెల పదో తేదీన కేబినెట్ సమావేశం ఉంటుందంటూ తొలుత లీకులిచ్చి.. చివరికి అధికారికంగా అనుమతి కోరిన ప్రభుత్వాధినేతకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తనదైన శైలిలో షాకిచ్చారు. కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి తీసుకోవాలని, అదీ 72 గంటల ముందు తీసుకోవాలంటూ సీఎస్ తేల్చిచెప్పడంపై ఇప్పుడు చంద్రబాబు శిబిరం ఆలోచనలో పడింది. కేబినెట్ భేటీని 14వ తేదీకి వాయిదా వేసుకుని. ఆ లోపు ఈసీని సంప్రదించేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారు.ఈ మధ్య కాలంలో ఈసీతో సై అంటే సై అంటున్న ఏపీ సీఎం చంద్రబాబు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలోనూ కారాలు, మిరియాలు నూరుతున్నారు. తాజాగా మారిన పరిస్ధితుల్లో ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీ సైతం ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట వినే పరిస్ధితి రావడం చంద్రబాబుకు ఇబ్బందికరంగా తయారైంది. పరిస్ధితులు నానాటికీ ప్రతికూలంగా మారుతున్న పరిస్ధితుల్లో ఎలాగైనా పంతం నెగ్గించుకోవాలని భావించిన చంద్రబాబు.. కేబినెట్ భేటీ నిర్వహించి తీరాలని నిర్ణయించారు. సాధారణ సమీక్షలకు అభ్యంతరం చెబుతున్న ఈసీ... కేబినెట్ సమావేశం నిర్వహిస్తే ఎలాగో అడ్డుకుంటుందని.. దీన్ని రాజకీయం చేయొచ్చని భావించిన ఏపీ సీఎంకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అనుకోని షాకిచ్చారు.కేబినెట్ సమావేశం నిర్వహణపై అధికారికంగా తనకు చివరి నిమిషంలో అందిన విజ్ఞాపనపై స్వయంగా నిర్ణయం తీసుకునే అవకాశం, పరిస్ధితులు ఉన్నప్పటికీ ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేబినెట్ భేటీకి అనుమతి నిరాకరిస్తే టీడీపీ దాన్ని రాజకీయం చేసే అవకాశం ఉండటంతో వ్యూహాత్మకంగా బంతిని ఈసీ కోర్టులోకి నెట్టేశారు. కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి తీసుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని సీఎం పంపిన కేబినెట్ భేటీ ఏర్పాట్ల అనుమతి లేఖకు సమాధానం ఇచ్చారు. దీంతో ప్రభుత్వం తప్పనిసరిగా ఈసీ అనుమతి తీసుకోక తప్పని పరిస్ధితి నెలకొంది. ఇదే విషయాన్ని ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆయనతో సమావేశమైన సీఎం ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ కు తేల్చిచెప్పారు. చంద్రబాబు వ్యూహం బూమరాంగ్ అయింది. సీఎస్ టార్గెట్ గా కేబినెట్ భేటీ నిర్వహించాలని తాను అనుకుంటే ఎల్వీఎస్ మాత్రం తెలివిగా బంతిని ఈసీ కోర్టులోకి నెట్టేయడం ఇప్పుడు టీడీపీ శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. సీఎస్ కోరుకుంటే కేబినెట్ భేటీపై ఈసీ నుంచి అనుమతి తీసుకోవడం పెద్ద సమస్యేమీ కాదు. రాష్ట్రంలో నెలకొన్న వేసవి పరిస్ధితులతో పాటు ఇతర అంశాలపై కేబినెట్ భేటీ కావాల్సిన అవసరం ఉందంటూ ఆయన ఈసీకి నివేదిస్తే సానుకూల నిర్ణయం వెలువడటం అసాధ్యం కాదనేది సచివాలయంలో అధికారులు చెబుతున్న మాట. కానీ చంద్రబాబు ఆది నుంచీ సీఎస్ ను టార్గెట్ చేస్తుండటం, ఆయనతో సంప్రదించకుండానే కేబినెట్ భేటీకి తేదీ ఖరారు చేయడం వంటి కారణాలతో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇగో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అందుకే నేరుగా ఈసీ అనుమతి తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శికి ఆయన స్ఫష్టంగా చెప్పినట్లు అర్ధమవుతోంది.ఇప్పుడు ప్రభుత్వం ముందున్నవి రెండే దారులు. ఒకటి కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి కేబినెట్ భేటీలో కేవలం రాష్ట్రంలో సమస్యలపై మాత్రమే చర్చిస్తామని, బిజినెస్ రూల్స్ పై మాట్లాడబోమని క్లారిటీ ఇస్తూ అజెండా ముందుంచడం, లేదా కేబినెట్ భేటీ రద్దు చేసుకోవడం.. ఈ రెండింటిలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈసీ అనుమతి తీసుకునేందుకే ప్రభుత్వ పెద్దలు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ దశలో వెనక్కి తగ్గితే ప్రభుత్వ పరువు పోతుందనేది వారి భావనగా ఉంది