యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఈ దఫా ఏపీలో ముగిసిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ హోరా హోరీ పోరు సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో గెలుపుపై కూడా అంచనాలు అందని పరిస్థితి నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కొవ్వూరులోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన కేఎస్ జవహర్ తర్వాత కాలంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, ఈయన స్థానికేతరుడు కావడంతో తీవ్రస్థాయిలో తమ్ముళ్ల మధ్య యుద్ధం జరిగింది. ప్రతి ఒక్కరూ జవహర్‌ను వ్యతిరేకించారు. ఆయన మాకు వద్దంటే వద్దని భీష్మించారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చంద్రబాబు జవహర్‌ను పక్కన పెట్టారు.అయితే, అదే సమయంలో రెండు జిల్లాలకు ఆవల ఉన్న విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను తెచ్చి.. ఇక్కడ నుంచి పోటీ చేయించారు. ఐదేళ్ల పాటు స్థానికేతరుడు అంటూ జవహర్ విషయంలో నానా రచ్చ రచ్చ చేసిన కొవ్వూరు తమ్ముళ్లు ఇప్పుడు మరో నాన్ లోకల్ అయిన అనితకు ఎందుకు ? సపోర్ట్ చేస్తారో ? బాబుకు తెలియదని అనుకోలేం. అనితను బలవంతంగా తెచ్చి ఇక్కడ రుద్దారు. అయితే, ఇప్పటికే నాన్‌లోకల్‌ను తిరస్కరించిన కొవ్వూరు తమ్ముళ్లు ఈమెను కూడా రిసీవ్ చేసుకోలేక పోయారనే కథనాలు వచ్చాయి. నిజానికి టీడీపీకి ఈ నియోజకవర్గం కంచుకోట. ఇక్కడ వరుస విజయాలతో టీడీపీ దూసుకుపోతోంది. అయితే, గత ఎన్నికల్లోను, ఇప్పుడు కూడా స్థానికులకు టికెట్ ఇవ్వకపోవడంతో ఇక్కడ వ్యతిరేకత పెరుగుతోంది.జవహర్‌ను తప్పిస్తే ఐదారుగురు స్థానికులు ఇక్కడ టీడీపీ సీటు ఆశించినా… ఓ కేంద్ర మాజీ మంత్రితో ఉన్న చొరవ నేపథ్యంలోనే అనితకు ఇక్కడ సీటు వచ్చినట్టు భోగట్టా. ఇక, ఇక్కడ నుంచి తాజా ఎన్నికల్లో వైసీపీ తరఫున గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఈమె ప్రజల్లోనే ఉన్నారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. దీంతో ప్రజల్లో మంచి పలుకుబడి కూడా సంపాయించుకున్నారు. ఆమె పట్ల సానుభూతి కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అటు వంగలపూడి అనిత నాన్ లోకల్ వర్సెస్ ఇటు తానేటి వనిత లోకల్ పోరు మాదిరిగా తాజా ఎన్నికలు మారిపోయాయి.ముఖ్యంగా టీడీపీ శ్రేణులు లోపాయికారీగా వైసీపీకి అనుకూలంగా పనిచేశారని అంటున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. అనిత స్థానికులతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చినా.. ఆమెకు సహకరించేందుకు పెద్దగా ఎవరూ ముందుకు రాలేని పరిస్థితి నెలకొందని తెలిసింది. తాజాగా చంద్రబాబు రాజమహేంద్రవరం లోక్‌సభ సెగ్మెంట్ రివ్యూలోనూ చంద్రబాబు కొవ్వూరు విషయంలో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇక్కడ టీడీపీ గెలుపు సులువు కాదని తేలిపోయింది. అనిత అసెంబ్లీలో ప్రత్యర్థులను టార్గెట్‌గా చేసుకుని బాగా మాట్లాడతారని కొవ్వూరుకు పంపిస్తే అక్కడ కొందరు స్థానికంగా ఆమెను చాలా ఇబ్బందులు పెట్టారని అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తాను కొవ్వూరు ఆపరేషన్ ప్రారంభిస్తానని కూడా బాబు చెప్పారు. ఏదేమైనా టీడీపీ కంచుకోట కొవ్వూరులో ఈ దఫా ఆ పార్టీ అభ్యర్థి అనిత గెలుపు గుర్రం ఎక్కడం అనేది అంత ఈజీ కాదు.