యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
చిత్తూరు:
పలమనేరు జిల్లాలో ఏనుగుల దాడులు మళ్లీ తీవ్రమవుతున్నాయి. పలమనేరు, బంగారుపాళెం మండలాల్లో ఏనుగుల గుంపులు స్వైరవిహారం చేశాయి. మామిడి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలమనేరు మండలం పెంగరగుంటకు చెందిన పొలాల్లో ఒబ్బడి చేసి, రాశిపోసి ఉంచిన వడ్లను పూర్తిగా తినేశాయి. మరికొందరి పొలాల్లో వరికుప్పలను నాశనం చేశాయి. కృష్ణాపురం, ముçసలిమొడుగు, చిన్నకుంటల వద్ద మామిడి తోటలను ధ్వంసం చేశాయి. చెట్లకొమ్మలను విరిచేశాయి. పొలం గట్లపై ఉన్న అరటి, జామలాంటి చెట్లను విరిచేశాయి. ఇంద్రానగర్‌లోని రైతు చంద్ర మామిడితోటలో రాత్రంతా ఏనుగుల గుంపు మకాం వేశాయి. అటవీ శాఖ సిబ్బందితో కలిసి స్థానికులు పెద్దయెత్తున శబ్దం చేయడంతో అవి అటవీ ప్రాంతం వైపు వెళ్లాయి. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేశారు. ఇన్నాళ్లు అడవిలోనే ఉన్న రాముడు, భీముడు అనే మదపుటేనుగులు పంట పొలాలపైకి వచ్చాయని బాధిత రైతు ఉమాపతి తెలిపాడు. బంగారుపాళెం మండలం అటవీ సరిహద్దు గ్రామమైన బండ్లదొడ్డిలో శుక్రవారం రాత్రి మామిడితోటపై ఏనుగులు దాడులు చేశాయి. గ్రామ సమీపంలోని తమిళనాడు–ఆంధ్ర సరిహద్దులో గల మోర్ధాన్‌డ్యామ్ మీదుగా ఏనుగులు మామిడి తోటలోకి వచ్చి, 15 మామిడి చెట్లను విరిచేశాయని బాధిత రైతు తెలిపారు. కీరమంద గ్రామంలో మామిడి, వరి పంటలను ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.