యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఈ నెల 25న విజయవాడకు ముఖ్యమంత్రి కెసిఆర్ వెళుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేసీఆర్ కొందరు ముఖ్యుల వద్ద వెల్లడించినట్లు తెలిసింది. ఎందుకు అని ఎవరూ అడిగే ధైర్యం చేయక పోయిన ఎందుకో అందరికి అర్ధమైపోయిందట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు జాతీయ రాజకీయాలపై కేసీఆర్ విస్తృతంగా చర్చలు జరిపారు. తాను జాతీయ రాజకీయాలలోకి వెళతానని కూడా ఆయన చెప్పారు. ప్రజలు ఆశీర్వదిస్తే దేశ రాజకీయాలను మారుస్తానని ఆయన ఇటీవల తెలంగాణలో ముగిసిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కన్నాముందు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిసా ముఖ్యమంత్ర నవీన్ పట్నాయక్ లాంటి వారితో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించిన కేసీఆర్ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టి జాతీయ ప్రత్యామ్నాయం వైపు చూడలేదు. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నది కూడా లోక్‌సభ ఎన్నికల నాటికి జాతీయ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టేందుకేనని ఆయన
చెప్పారు.తెలంగాణ అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీ సాధించిన ఆయన ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల సరళిని గమనిస్తున్న కేసీఆర్ ఒక దశలో బిజెపికి అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా వేసుకుని మూడో ఫ్రంట్ గురించి ఆలోచించడం మానేశారని అందరూ అనుకున్నారు. అయితే అందుకు భిన్నంగానే కనిపిస్తున్నదనే రిపోర్టులు రావడంతో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లోక్‌సభ పోలింగ్ చివరి దశకు వచ్చిన ఈ సమయంలో బిజెపికి అనుకున్నన్ని స్థానాలు వచ్చే అవకాశం లేదని కేసీఆర్‌కు నివేదికలు వచ్చినట్లుగా చెబుతున్నారు. దాంతో ఆయన మళ్లీ ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయానికి తెరతీసినట్లు కనిపిస్తున్నది. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే పార్టీ అధ్యక్షులనే కలుస్తుండటం అప్పటిలో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ను బలహీన పరచి పరోక్షంగా బిజెపికి లబ్ది చేకూర్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని అప్పటిలో వార్తలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ఆరోపణ చేసి కేసీఆర్‌ను బిజేపి బీ టీమ్ గా అభివర్ణించింది. కేసీఆర్ మాత్రం తన పంథా మార్చుకోకుండా కాంగ్రెస్ అనుకూల పార్టీల వారినే ఆయన కలిసి మూడో
ప్రత్యామ్నాయం గురించి చెబుతున్నారు.ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో జగన్ బలం పుంజుకుంటే అది మూడో ప్రత్యామ్నాయానికి అదనపు శక్తిని ఇస్తుందని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ 20 లోక్‌సభ స్థానాల వరకూ గెలుచుకుంటారని కేసీఆర్‌కూడా అంచనా వేస్తున్నారట. ఇదే జరిగితే కేసీఆర్, జగన్‌ల జోడీ ఈ దేశాన్ని నడిపించే కీలక శక్తిగా మారేందుకు అవకాశం ఉంది.అయితే తెలంగాణలో 16 స్థానాలు కేసీఆర్ గెలిచినపుడే ఇది సాధ్యం అవుతుందనేది కూడా నిర్వివాదాంశం.