కృష్ణాజిల్లా: అన్నదాత కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నాడు. నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు వ్యాపారుల మధ్య పోటీ కొరవడటంతో ధరలు గణనీయంగా పడిపోయాయి. వ్యవసాయ సీజన్ దగ్గర పడుతున్నా రైతుల చేతిలో సొమ్ములు లేక భూములను సాగుకు సిద్ధం చేయడం లేదు. పత్తి, అపరాల సాగుతో వచ్చిన నష్టాలు, వర్షాలు లేక దిగుబడులు సక్రమంగా రాకపోవడంతో కౌలు రైతులు భూములు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా కౌలు ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. సుబాబుల్ టన్ను ధర రూ.2200లకు పడిపోవడంతో పాటు పేపరు కంపెనీలు దళారులను ప్రోత్సహించడంతో రైతులు చెట్లు నరికేస్తున్నారు. పంటను తొలగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. జగ్గయ్యపేట, చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో వానరాల బెడద ఎక్కువగా ఉంది. పత్తి కాయలను తినేస్తుండటంతో కాపలా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భూములను కౌలుకు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. పశ్చిమకృష్ణాలో అత్యధికంగా సాగు చేసే పత్తి
పంటకు మూడేళ్లుగా గిట్టుబాటు ధర లభించడం లేదు. పెట్టుబడి ఖర్చులు పెరగడంతో పంట సాగుపై రైతులు ఆశలు వదులుకుంటున్నారు. ఇళ్లల్లో పత్తి నిల్వలు ఉన్నప్పుడు క్వింటాల్‌కు రూ.అయిదు వేలు ధర మించలేదు. రైతుల నుంచి వ్యాపారుల చేతుల్లోకి వెళ్లగానే రూ.ఆరు వేలకు చేరింది. కంచికచర్ల, నందిగామ, చందర్లపాడు, వీరులపాడు, మైలవరం, గంపలగూడెం మండలాల్లో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగుచేస్తున్నారు. పురుగుమందుల ఖర్చు పెరగడం, పత్తి తీతకు క్వింటాల్‌కు రూ.1200 నుంచి రూ.1500 వరకు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఎరువులు, వ్యవసాయ ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. వర్షాలు ఆశాజనకంగా లేకపోవడంతో దిగుబడి తగ్గి రైతులు భారీగా నష్టపోయారు. గత ఏడాది వరకు ఎకరా కౌలు రూ.10 నుంచి రూ.16 వేల వరకు ఉన్నాయి. ఈ ఏడాది మిర్చి దిగుబడులు సైతం తగ్గడంతో పాటు ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో కౌలుకు భూములు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.
పత్తి పంట తర్వాత అత్యధికంగా సుబాబుల్ సాగు చేస్తారు. సుమారు 70 వేల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా. గత ఏడాది వరకు టన్ను ధర రూ.4400 వరకు ఉండగా, కర్ర నరికేందుకు, ట్రాక్టర్‌లో డంపింగ్ యార్డుకు తీసుకొచ్చేందుకు మొత్తం కలిపి రూ.800 ఖర్చు అవుతోంది. రైతుకు టన్నుకు రూ.3500 నుంచి రూ.3700 వరకు లభించేది. ప్రస్తుతం కంపెనీలు సక్రమంగా కొనుగోలు చేయకపోవడం, దళారులను ప్రోత్సహిస్తుండటంతో రూ.2200 మాత్రమే లభిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కర్ర నరికిన తర్వాత రైతులు పంటను తొలగించేందుకు మక్కువ చూపుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు నాఫెడ్ ఆధ్వర్యంలో కందులు, పెసలు, శనగలు, మినుములు కొనుగోలు చేయాల్సి ఉంది. అరకొరగా మాత్రమే కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖరీఫ్‌లో చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలతో అపరాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రబీలో పెథాయ్ తుపాను ప్రభావంతో శనగ పంట నాణ్యత దెబ్బతింది. ప్రస్తుతం రైతుల ఇళ్ల వద్ద ఉన్న శనగలను నాణ్యత సాకుగా చూపి కొనుగోలు చేయడం లేదు. తక్కువ ధరలకే వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Related Posts