యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి 2 లో ముక్కోణపు పోటీ నువ్వా? నేనా? అన్నట్లే నడిచింది. టిడిపి, వైసిపి, జనసేన అభ్యర్థులు సర్వశక్తులతో ఇక్కడ తలపడ్డారు. అయితే ఈ పోటీలో విజయం తమదే అంటే తమదే అనే ధీమాను మూడు పార్టీలు వ్యక్తం చేయడం విశేషం. ఇప్పటికే టిడిపి అభ్యర్థి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మెజారిటీ 25 వేలు నాకు అంటూ ప్రకటించారు. ఇక జనసేన కూడా తమ పార్టీ గెలిచే స్థానాల్లో రాజమండ్రి రూరల్ ను లెక్కేసేసింది. ఈ నేపథ్యంలో వైసిపి మరీ అంత దారుణంగా ఇక్కడ ఉందా అంటే అదేమీ కాదంటున్నారు ఆ పార్టీ వర్గాలు.రాజమండ్రి 2 లో గత 2014 ఎన్నికలకు ఇప్పటికి చాలా తేడా ఉందని చెబుతున్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ బలం మూడు పార్టీలు కలిపి ఉంటే ఇప్పుడు ఒకే పార్టీ గా బరిలో నిలిచిందని అంటున్నారు. అలాగే 2009 ఎన్నికల్లో బిసి అభ్యర్థిని నేరుగా బరిలోకి దింపడం టిడిపికి కలిసొచ్చిందని ప్రధాన ప్రత్యర్థి పార్టీలు రెండు కాపు సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వడం బిసి అభ్యర్ధికి కలిసివచ్చి విజయం దక్కిందన్నది వైసిపి లెక్క.ఇప్పుడు తమ పార్టీకి ఎస్సి ఎస్టీ మైనారిటీలతో పాటు రాజమండ్రి పార్లమెంట్ టికెట్ బిసి అభ్యర్ధికి ఇవ్వడం ప్లస్ అయ్యి నియోజకవర్గంలో టిడిపి ఓటు బ్యాంక్ ను నిట్టనిలువునా చీల్చినట్లు వైసిపి అంచనా వేస్తుంది. దాంతో అటు టిడిపి, జనసేన లపై పైచెయ్యి సాధించడం ఖాయమని మెజారిటీ మాత్రం తగ్గొచ్చని టిడిపి ఇక్కడ మూడో ప్లేస్ కి పరిమితం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం.