ఉరవకొండ వాటర్‌షెడ్ కమిటీ పరిధిలో ఏడు పంచాయతీలు, వీటి పరిధిలో 11 గ్రామాలు ఉన్నాయి. మైక్రో వాటర్‌షెడ్లు... పెద్దముష్టూరు, చిన్నముష్టూరు, షేక్సానుపల్లి, ఆమిద్యాల, మోపిడి, లత్తవరం ఉన్నాయి. 2010-11 (రెండో బ్యాచ్) ఆర్థిక సంవత్సరంలో ఈ వాటర్‌షెడ్ మొదలైంది. 2010 మార్చిలో వాటర్‌షెడ్ మొదలైతే... 2017 డిసెంబరు నాటికి కేవలం రూ.2.83 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. ఇది కూడా ఏడేళ్లలో చేసిన ఖర్చు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ ఆఖరు నాటికే ఏకంగా రూ.1.07 కోట్లు ఖర్చు పెట్టడం విశేషం. జనవరిలో రూ.6 లక్షలు, ఫిబ్రవరిలో రూ.14 లక్షలు వ్యయం చేస్తే... మార్చిలో మాత్రం ఏకంగా రూ.57.25 లక్షలు, ఏప్రిల్‌లో రూ.30.98 లక్షల ప్రకారం ఖర్చు చేసిన తీరు చూస్తే విస్తుపోవాల్సిందే.2010 మార్చి 31న మొత్తం రూ.6.19 కోట్ల అంచనాతో ఆరంభమవగా.. ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరుకు రూ.3.89 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.2.3 కోట్లు మిగిలి ఉంది. మొత్తం వ్యయంలో ఎక్కువగా సహజ వనరులకే రూ.3.47 కోట్లలో రూ.1.99 కోట్లు, పరిపాలన కోసం రూ.61.89 లక్షల్లో రూ.46.16 లక్షలు, ఉత్పాదక పెంపుదల కోసం రూ.61.89 లక్షల్లో రూ.47.94 లక్షలు, జీవనోపాధుల కల్పనకు రూ.55.7 లక్షల్లో రూ.53.85 లక్షల ప్రకారం వ్యయం చేశారు. గత ఎనిమిది నెలల్లో 2.4 లక్షల పని దినాలు నమోదయ్యాయి. ఇదంతా వినడానికి.. చూడటానికి చక్కగా కనిపిస్తుంది. గ్రామైక్య సంఘాల ఖాతాల్లోకి నిధులు మళ్లించారు. ఇదంతా ఒక ఎత్తైతే... పనుల నాణ్యత పూర్తి ప్రశ్నార్థకమే. దేవుడి మాన్యంలో అసలు పనులే చేయకూడదు. కానీ.. నిధులు విపరీతంగా ఖర్చు చేయడానికి యంత్రాలను వాడేశారు. ఎక్కడ పడితే అక్కడ సేద్యపు కుంటలు, కందకాలు, రాళ్లు, రప్పల తొలగింపు చేపట్టారు. మోపిడి, లత్తవరం, షేక్సానుపల్లి వంటి ప్రాంతాల్లో దేవుడి మాన్యంలో ఇష్టారాజ్యంగా పనులు చేశారు. సేద్యపు కుంటలు, చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. మినీ పర్కులేషన్ ట్యాంకులను సైతం కట్టారు.దేవుని మాన్యంలోనే ప్రతి పది నుంచి 15 మీటర్ల దూరంలో కుంటలు తవ్వారు. ఉపాధి కింద తవ్విన కుంటకే వాటర్‌షెడ్‌లో బిల్లు పెట్టడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇలా ఈ వాటర్‌షెడ్‌లో ఇష్టానుసారం పనులు జరగడం విశేషం.