యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలు హతమయ్యింది. బుధవారం ఒడిశాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కామేశ్వరి అలియాస్ స్వరూప.. అలియాస్ రింకీ చనిపోయింది. కోరాపుట్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో రింకీతో పాటూ మరో నలుగుర్ని భద్రతా దళాలు హతమార్చాయి. నందాపూర్ బ్లాక్ పరిధిలో కిటువాకమీ అడవుల్లో 15 మందికి పైగా మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు, ఎస్‌వోజీ బలగాలతో దాడులు నిర్వహించారు. బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. స్వరూప అలియాస్ కామేశ్వరిది శ్రీకాకుళం కాగా.. ఈమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈమె తల్లిదండ్రులు శ్రీకాకుళంలో ఉండగా కామేశ్వరి భీమవరంకు చెందిన వ్యక్తితో వివాహమయ్యింది. కొంతకాలం తర్వాత ఆమెకు భర్తతో విభేదాలు రావడంతో విడిపోయారు. తర్వాత
తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ డిపోలో కామేశ్వరి కండక్టర్‌గా పనిచేసింది. కొద్ది రోజుల తర్వాత 2008–09లో కామేశ్వరి మావోయిస్టుల్లో చేరింది. అప్పటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ యాక్షన్ టీమ్ సభ్యురాలిగా మారింది. గతేడాది సెప్టెంబర్ 23న అరకు పరిధిలోని డుంబ్రిగూడ మండలం లివిటిపుట్ట సమీపంలో.. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఇద్దర్ని కాల్చి చంపారు. దాదాపు 20మందికిపైగా మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐకి అప్పగించారు. ఈ హత్యకేసులో స్వరూప ముఖ్య నిందితురాలిగా ఉంది. పది రోజుల క్రితమే ఈ హత్యకేసులో కీలక నిందితుడైన మావోయిస్టు నేతజయరాం ఖిల్లాను అరెస్ట్ చేశారు. కోరాపుట్ జిల్లాలో ఖిల్లాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఖిల్లాను పోలీసులు ఎన్‌ఐఏ అధికారులకు అప్పగించారు.