ఏపీపై సూర్యుడి ప్రతాపం కొనసాగుతోంది. భానుడి తీక్షణత కారణంగా రాష్ట్రం నిప్పులగుండాన్ని తలపిస్తోంది. అనేక జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, కొన్నిరోజులుగా
నిప్పులకుంపటిలా భగభగలాడిపోతున్న ప్రకాశం జిల్లాలో ఇవాళ కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లా పశ్చిమప్రాంతంలో ఉన్న త్రిపురాంతకంలో మధ్యాహ్నం సమయానికి
47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడం పరిస్థితికి అద్దం పడుతోంది.సాధారణంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుంటాయి. అయితే ఫణి తుపాను నేపథ్యంలో వాతావరణంలో పెనుమార్పులు వచ్చాయి.
నడివేసవిలో వచ్చిన ఈ పెనుతుపాను వాతావరణంలోని తేమనంతటినీ తనతో పాటు తీసుకెళ్లింది. తద్వారా రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడడమే కాకుండా ఎండ వేడిమి ఒక్కసారిగా పెరిగిపోయింది. 40 డిగ్రీలకు అటూఇటూగా ఉన్న ఉష్ణోగ్రతలు ఏకబిగిన 45 డిగ్రీలకు పైన నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.ఈ పరిస్థితి మరో వారం రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన ఎండలకు తోడు పశ్చిమ దిక్కు నుంచి వీస్తున్న వడగాడ్పులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.