YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పార్టీ కుమ్ములాటలకు రూప బలికాబోతున్నారా...

పార్టీ కుమ్ములాటలకు రూప బలికాబోతున్నారా...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాజమహేంద్రవరం లోక్ సభ టిడిపి అభ్యర్థిగా ఎన్నో అంచనాలతో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన మాగంటి రూపాదేవి సొంత పార్టీ నేతల‌ అంతర్గత కుమ్ములాటలతో బ‌లి కాబోతున్నారన్న వార్తలు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో హాట్ హాట్‌గా మారాయి. సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ ప్రత్యక్ష ఎన్నికల నుంచి వైదొలగడంతో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎవరిని పోటీ చేయించాలన్న దానిపై చంద్రబాబు పెద్ద కసరత్తే చేశారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల పేర్లను పరిశీలించి చివరకు నామినేషన్ల పర్వం ప్రారంభం అయ్యాక రూపాదేవి పేరు ఖరారు చేశారు. రెండు సంవత్సరాలుగా మామ మురళీమోహన్‌కు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో స‌హాయ స‌హ‌కారాలు అందించిన‌ రూపాదేవి అభ్యర్థిత్వం చివరిలో ఖరారు కావడం కూడా టీడీపీకి పెద్ద మైనస్.  లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు టిడిపి తరపున పోటీ చేసిన అభ్యర్థులు అందరూ సీనియర్లు కావడంతో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రూపాదేవి అభిప్రాయానికి ఇక్కడ విలువ లేకుండా పోయింది. లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు సైతం రూపాదేవి గెలుపున‌కు ప్రతిబంధకంగా మారాయి. వైసీపీ ఈ సారి ఇక్క‌డ బీసీ కార్డు ప్రయోగించ‌డం కూడా టీడీపీకి ఎదురు దెబ్బ‌. ఇక ముందు నుంచి అనపర్తి అభ్యర్థి విషయంలో టీడీపీ శ్రేణిలోనే అంత సానుకూల అభిప్రాయం లేదు. గత ఎన్నికల్లోనే చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఈ సారి సీటు ఇస్తే అక్కడ టిడిపి ఓడిపోతుందని చాలామంది చెప్పినా చంద్రబాబు వినకుండా మ‌ళ్లీ ఆయ‌న‌కే సీటు ఇచ్చారు. 2009 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ మైన‌స్ కావ‌డంతో ముర‌ళీ మోహ‌న్ ఎంపీగా ఓడిపోయారు.రాజానగరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పోలింగ్‌కు ముందు వ్యవహరించిన తీరుతో ఈ సీటులో కూడా టిడిపి గెలవడం కష్టమనే అంటున్నారు. అన‌ప‌ర్తి, రాజాన‌గరం నియోజ‌క‌వ‌ర్గాలు రెండూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు విష‌యంలో తీవ్రమైన ప్రభావం చూప‌నున్నాయి. రాజ‌మ‌హేంద్రవ‌రం సిటీ నియోజకవర్గంలో కొంద‌రు ఎంపీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచిన‌ట్టు తెలుస్తోంది. కొంద‌రు ప్రచారంలో ఎమ్మెల్యే ఓటు టీడీపీకి, ఎంపీ ఓటు మీ ఇష్టం అని చెప్పడంతో కొన్ని సామాజిక‌వ‌ర్గాల్లో కొంత క్రాస్ ఓట్ జ‌రిగిన‌ట్టు టాక్‌. సిటీ మేయర్ పంతం రజ‌నీ శేషసాయి వర్గం సైతం ప్రత్యర్థి వర్గానికి సహకరించిన ప్రచారం కూడా జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి జవహర్‌ను మార్చిన చంద్రబాబు.. ఎక్కడో విశాఖ జిల్లా నుంచి తీసుకువచ్చిన అనితకు సీటు ఇవ్వడంతో టీడీపీలోనే కొన్ని వ‌ర్గాలు ఇక్కడ కూడా వైసీపీకి స‌హ‌క‌రించిన‌ట్టు తెలుస్తోంది.గత రెండు ఎన్నికల్లో టిడిపి గెలుస్తున్న నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఈ రెండు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని టీడీపీలో మెజార్టీ కార్యకర్తలు తీర్మానించినా చంద్రబాబు తిరిగి వీరికే సీట్లు ఇచ్చారు. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలుపు డౌట్‌లో ప‌డింది. ఏదేమైనా భారీ అంచనాలతో, ఎన్నో ఆశలతో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన రూపాదేవికి ఈ ఎన్నికలు సానుకూల ఫలితాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చేసిన పొరపాట్లు, కొన్ని చోట్ల‌ సొంత పార్టీ అభ్యర్థులే క్రాస్ పోట్లు ఇవ‌న్ని క‌లిసి రూపా మెడ‌కు చుట్టుకున్నాయి. ఏదేమైనా ఇన్ని సంక్లిష్ట ప‌రిస్థితుల మ‌ధ్య రూపాదేవి ఎంపీగా ఎంత వ‌ర‌కు విజయం సాధిస్తారో ? తుది ఫ‌లితాల వ‌ర‌కు వెయిట్ చెయ్యాల్సిందే.

Related Posts