యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
డీఎల్ రవీంద్రారెడ్డి… సీనియర్ నేత… ఈ ఎన్నికల్లో ఆయన చివరి క్షణంలో నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయ భవితవ్యం ఇప్పుడు మైదుకూరు నియోజకవర్గం ఫలితాలపైనే ఆధారపడి ఉందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. డీఎల్ రవీంద్రారెడ్డి సీనియర్ నేత. ఆయన ఆరుసార్లు మైదుకూరు నియోజకవర్గం నుంచి గెలిచి రికార్డు సృష్టించారు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండు ప్రధాన పార్టీల చుట్టూ తిరిగారు.డీఎల్ రవీంద్రారెడ్డి తొలుత తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నారు. తనకు మైదుకూరు నియోజకవర్గం టిక్కెట్ టీడీపీలో అయితేనే లభిస్తుందని ఆయన గంపెడాశలు పెట్టుకున్నారు. అక్కడ గతఎన్నికలలో పోటీచేసి ఓటమి పాలయిన పుట్టా సుధాకర్ యాదవ్ ను టీటీడీ ఛైర్మన్ గా చేయడంతో డీఎల్ ఆశలు రెట్టింపయ్యాయి. నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కలిశారు. ఆయన నుంచి స్పష్టమైన హామీ లభించలేదు.పుట్టా సుధాకర్ యాదవ్ తనకే టిక్కెట్ కావాలని పట్టుబట్టడంతో చంద్రబాబు ఆయనవైపే మొగ్గు చూపారు. దీంతో డీఎల్ కు టీడీపీ టిక్కెట్ దక్కలేదు. అయితే చంద్రబాబు నుంచి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్న హామీ మాత్రం లభించింది. ఇక డీఎల్ చూపు వైసీపీ వైపు పడింది. ఆయన ప్రధాన అనుచరులు జగన్ ను కలిసి డీఎల్ ను పార్టీలో చేర్చుకోవాలని, సీటు ఇవ్వాలని కోరారు. అయితే జగన్ సున్నితంగా తిరస్కరించారు. డీఎల్ పార్టీలోకి రావచ్చని, అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నందున తాను టిక్కెట్ ఇవ్వలేనని జగన్ తేల్చి చెప్పారు.దీంతో డీఎల్ రవీంద్రారెడ్డి అంతా ఆలోచించి చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ నుంచి కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి హామీ లభించిందని చెబుతారు. టీడీపీ ని మైదుకూరులో భూస్థాపితం చేస్తానని డీఎల్ శపథం కూడా చేశారు. మైదుకూరు అభ్యర్థికి మద్దతుగా ప్రచారంకూడా చేశారు. అయితే డీఎల్ ఆశలు నెరవేరాలంటే… రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తేనే సరిపోదట. మైదుకూరులో ఖచ్చితంగా గెలిస్తేనే డీఎల్ ను పెద్దల సభకు పంపుతారట. ఇదీ అసలు సంగతి. మరి డీఎల్ ఆశలు నెరవేరాలంటే రెండు జరగాలి. ఒకటి జగన్ సీఎం కావడం. రెండు మైదుకూరులో వైసీపీ జెండా ఎగరడం.