ప్రతి జిల్లాలో ఆయా వర్గాలకు సంక్షేమ భవనాల్ని నిర్మించాలన్న హామీని నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. టిడిపి ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్నా ఇంత వరకు ఒక్క భవనాన్ని కూడా నిర్మించలేదన్న విమర్శలొస్తున్నాయి. భవనాల నిర్మాణాలకు అవసరమైన స్థలాల సేకరణ కూడా ఇంత వరకు పూర్తి చేయలేదంటే సంక్షేమ భవనాల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్త శుద్ధి ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అన్ని జిల్లాల్లో అంబేద్కర్ భవనాలు, గిరిజన భవనాలు, బిసి భవనాలు, కాపు భవనాలతో పాటు క్రైస్తవులకు క్రిస్టియన్ భవనాలు, ముస్లింలకు షాదీకానాల పేరుతో ప్రత్యేక భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. తర్వాత ప్రతి నియోజక వర్గం, మండల కేంద్రాల్లో ఒకటి చొప్పున నిర్మించనున్నట్టు ప్రకటించారు. అంబేద్కర్, గిరిజన, బిసి, కాపు భవనాలకు జిల్లా కేంద్రాల్లో అయితే కోటి రూపాయలు, నియోజక వర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో అయితే రూ.75 లక్షలతో భవన నిర్మాణాలు చేపట్టనున్నట్టు గతంలో పేర్కొన్నారు. ప్రస్తుతమున్న భవనాలకు భిన్నంగా వీటిని నిర్మిస్తామని, ఇందు కోసం ప్రముఖ ఆర్కిటెక్ట్‌లను, ఉద్యానవన శాఖ అధికారుల్ని సంప్రదిస్తామని అప్పట్లో ఆయా శాఖల మంత్రులు వెల్లడిం చారు. ఆయా వర్గాల సాంస్కృతిక, ఆచార వ్యవహారాల కనుగుణంగా పెళ్లిళ్లు, ఉత్సవాలు, సమావేశాలు వంటి కార్యక్రమాల్ని నిర్వహించుకునేందుకు సంక్షేమ భవనాల్ని నిర్మించాలని గతంలో భావించారు. అంతే కాకుండా ఈ భవనాల్ని ఆర్థిక వనరుగా అభివృద్ధి చేసుకుంటూ, వచ్చే ఆదాయాన్ని ఆయా వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చని ప్రతిపాదించారు. దీంతో పాటు వరదలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు సంభవించి నప్పుడు వీటిని పునరావాస కేంద్రాలుగా ఉపయోగించు కోవచ్చని ప్రభుత్వం భావించింది. సంక్షేమ భవనాల నిర్మాణాలకు ఇంత వరకు కనీసం స్థలాల సేకరణ కూడా చేయకపోవడం శోచనీయం. భవన నిర్మాణాలకు కావలసిన స్థలాల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశామని, కలెక్టర్ల నుంచి ఎటువంటి స్పందనా రావడంలేదని ఉన్నతాధికారులు చెప్తున్నారు.