స్పెషల్ స్టోరీ ఫ్రామ్ యువ్ న్యూస్:
అధినేతలు, అధికారయంత్రాంగం కలిసి నడిస్తే పాలన సాఫీగా సాగిపోతుంది. కాదనుకుని కయ్యానికి కాలు దూస్తే కార్యనిర్వహణ కుంటుపడుతుంది. డెమొక్రసీలో ప్రజలే ప్రభువులు అని చెబుతుంటారు. నిజానికి రాజకీయనేతలు, అధికారులు కలిసి పెత్తనం చేస్తుంటారు. ఇద్దరూ సమన్వయంతో ఉన్నంతవరకూ సమస్య రాదు. ప్రగతి రెండు చక్రాలపై పరుగులు తీస్తుంది. సహకారం లోపిస్తే మాత్రం ప్రతిపనిలోనూ చికాకులే. ప్రజల నుంచి ఎన్నికయ్యాం కాబట్టి తాము చెప్పినట్లు చేయాల్సిందేనని నాయకులు పట్టుబడుతుంటారు. ముఫ్ఫైఏళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించాలి కాబట్టి తామే ప్రజలకు జవాబుదారీ అంటారు అధికారులు. పైపెచ్చు అయిదేళ్లు పవర్ లో ఉండి దిగిపోయే నాయకులు చెప్పినట్లు తలాడిస్తే నిండా మునిగిపోతామంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుంటారు. పరోక్షంలో ఎటువంటి విమర్శలు చేసుకున్నా కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు చాలావరకూ సర్దుకుపోతుంటారు. అందువల్లనే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకు సాఫీగానే కనిపిస్తుంది. కానీ ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడినప్పుడు మాత్రం చిన్నసమస్య కూడా భూతద్దంలో కనిపిస్తుంది. ప్రతివిషయమూ పేచీగానే తోస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అదే.అభివృద్ధి, సంక్షేమం ఏ సర్కారుకైనా అవసరమే. తగినంత ఆదాయము, అవసరాలకు అనుగుణంగా ఖర్చు రెండూ సంతులనంగా ఉండాలి. ఇక్కడే రాజకీయ కార్యనిర్వాహకవర్గం, అధికారయంత్రాంగం బాధ్యతలు వేర్వేరుగా కనిపిస్తుంటాయి. రాష్ట్రాన్ని ఏదో విధంగా అభివ్రుద్ధి పథంలో పెట్టేయాలని భారత పౌరసేవలకు చెందిన అధికారులు ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ప్రజాప్రతినిధులు సంక్షేమానికే పెద్ద పీట వేయాలని తలపోస్తుంటారు. ఈ రెండూ బ్యాలెన్సు చేసుకోవడంలోనే పరిపాలన రాణిస్తుంది. అలాగే వివిధ రూపాల్లో పన్నులు పెంచి ఖజానాను నింపడంపై అధికారులు దృష్టి పెడుతుంటారు. పన్నులను సాధ్యమైనంతవరకూ పెంచకుండా అదే సమయంలో ప్రజావసరాలకు ఖర్చులు పెంచాలని చూస్తుంటారు నాయకులు. ఇందులో ప్రజలకు జవాబుదారీ వహిస్తూ వారిని సంతృప్తిపరచడమే లక్ష్యంగా రాజకీయం యోచిస్తుంది. దానికంటే ఆర్థికపరిపుష్టి పైనే అధికారులు ఆసక్తి చూపుతుంటారు. ఇటువంటి విషయాల్లో కొంతమేరకు విభేదాలు తలెత్తినా ఎక్కడో ఒకచోట మధ్యేమార్గానికి వచ్చేస్తుంటారు. అంతిమంగా నాయకుల మాటే చెల్లుబాటవుతుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన పరిస్థితి ఇందుకు భిన్నమైనది.రాజకీయ బాసులకు సలాం కొట్టి గులాం గిరీ చేసే ఉద్యోగవర్గం బాగా పెరిగిపోయింది. తమకు కావాల్సిన స్థానాల్లో పోస్టింగుల కోసం , అవినీతి చేసినా చూసీచూడకుండా ఉంటారనే ఉద్దేశంతోనే ఇలాంటి వక్రమార్గం పడుతున్నారు. ఎన్నికలు జరిగి అందులోనూ ఎవరు అధికారంలోకి వస్తారో తెలియని సందిగ్ధత నెలకొన్నప్పుడు బ్యూరోక్రసీ అడ్డంగా చీలిపోతుంది. తమ తమ అంచనాల మేరకు అధికారంలోకి వస్తుందని భావిస్తున్న పార్టీల చుట్టూ యంత్రాంగం చేరిపోతుంది. భజన మొదలు పెడుతుంది. ఎందుకైనా మంచిదని నాయకుల దర్శనం చేసుకుని ఒక నమస్కారం పెట్టుకుని వచ్చేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది అదే. కులాలు, పార్టీల వారీగా యంత్రాంగమూ చీలిపోయింది. ఎన్నికలు ముగిశాయి. ఒక అనిశ్చితి . ఈ స్థితిలో ప్రభుత్వం సమీక్షలు చేస్తే తాము హాజరు అవ్వకుండా ఉండటం ద్వారా ఒకవేళ ప్రభుత్వం మారితే ఆ పార్టీ వద్ద మంచి మార్కులు కొట్టేయొచ్చనేది కొందరి దూరాలోచన. ఇందులో కొంత రిస్కు కూడా దాగి ఉంది. ఒకవేళ ఈ ప్రభుత్వమే కొనసాగితే ఫలితం వేధింపుల రూపంలో వెన్నాడవచ్చు. అయినా కోడ్ సాకుతో సాహసిస్తున్నారు. నిజానికి ఎన్నికల కోడ్ అనేది విధి విధానాలు మాత్రమే. చట్టం కాదు. తమ అధికారిక విధులలో భాగంగా ప్రభుత్వ సూచనలు పాటించవచ్చు. విధానపరమైన నిర్ణయాలు కొత్తగా తీసుకుంటే తప్ప సాధారణ రాజకీయ ప్రభుత్వ కార్యకలాపాల్లో అధికారులు భాగస్వాములుగా పాల్గొనవచ్చు .వెస్ట్ మినిస్టర్ తరహా ప్రజాస్వామ్యాన్ని అనుకరించే భారతదేశంలో ‘ఎస్ బాస్’ అంటూ గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా నాయకులు చెప్పినది తూచ తప్పకుండా అనుసరించడమే ఎక్కువ. నిబంధనలు అంగీకరించకపోయినా అధికారులు పెద్దగా ప్రతిఘటించరు. పొలిటికల్ బాసుల మనసెరిగి ప్రవర్తిస్తుంటారు. నిబంధనలకు వక్ర భాష్యం ఎలా చెప్పవచ్చో నేతలకే పాఠాలు చెబుతుంటారు. తద్వారా పాపంలో భాగస్వాములవుతుంటారు కొందరు. అలా ఇరుకున పడిన అధికారులూ ఉన్నారు. వారిపై కేసులూ ఉన్నాయి. నిజానికి అధికారులు ఏమి చేయాలి? వారికున్న బాధ్యతలు ఏమిటి? మంత్రులకుండే అధికారాలేమిటనే విషయాలపై స్పష్టమైన నిబంధనలే ఉన్నాయి. ఉద్యోగ నియామక నియమాలు, బిజినెస్ రూల్స్,కేబినెట్ అధికారాలు వంటి అనేక అంశాలు ప్రభుత్వ పనితీరును నిర్దేశిస్తూ ఉంటాయి. సాకులు వెదుక్కోకుండా ప్రజాప్రయోజనాల కోసమే రాజకీయనేతలు, అధికారులు కట్టుబడి ఉన్నప్పుడు అసలు నిబంధనలు బంధనాలుగా మారవు. గిల్లికజ్జాలు పెట్టుకుందామని ఇరువర్గాలు నిర్ణయించుకున్నప్పుడే పేచీ. రాష్ట్రముఖ్యమంత్రి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల వివాదాన్ని పెంచి పెద్ద చేసేశారు. మంత్రివర్గ సమావేశానికి సైతం దానిని చుట్టేశారు. ఇప్పుడు ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక ఇరువర్గాలు గింజుకుంటున్న పరిస్థితి. ఎన్నికల కమిషన్ ఇంతవరకూ జోక్యం చేసుకోకపోయినా అదో పెద్దబూచిగా చూపుతూ పొలిటికల్ డ్రామా నడుపుతున్నాయి పొలిటికో, బ్యూరోక్రసీలు.